హైవేలకు నిధులు విడుదల చేయండి
● కేంద్ర మంత్రికి ఎంపీ రవిచంద్ర వినతి
ఖమ్మంవైరారోడ్: రాష్ట్రంలో పెండింగ్ ఉన్న పలు జాతీయ రహదారులు పూర్తయ్యేలా నిధులు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈమేరకు గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్‌లోని ఆయన చాంబర్‌లో మంత్రిని కలిసి ఎంపీ పెండింగ్ ఉన్న హైవే పనులు, అవసరమైన నిధులతో చర్చించారు.
నామినేషన్ కేంద్రాల్లో పరిశీలన
కారేపల్లి/ఏన్కూరు: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కారేపల్లి, ఏన్కూరు మండలాల్లోని పలు కేంద్రాల్లో నామినేషన్ల స్వీరణను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ గురువారం పరిశీలించారు. కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, నామినేషన్ల స్వీకరణపై అధికారులతో మాట్లాడారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా పర్యవేక్షించాలని సూచించారు. ఎంపీడీఓలు శ్రీనివాస్, భాగ్యశ్రీ, ఎంపీఓలు రవీంద్రప్రసాద్, జీవీఎస్.నారాయణ, ఏడీఏ కిరణ్ కార్యదర్శి నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఏన్కూరు మండలంలోని పలు కేంద్రాలను కల్లూరు సబ్ కలెక్టర్ ఆజయ్‌యాదవ్ కూడా పరిశీలించారు.
పాలియేటివ్ కేర్
సెంటర్‌లో తనిఖీ
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రిలోని పాలియేటివ్ కేర్ సెంటర్(ఉపశమన సంరక్షణ కేంద్రం)ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డి.రామారావు గురువారం తనిఖీ చేశారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్‌తో కలిసి తనిఖీ చేసిన ఆయన ఇన్ పేషంట్లతో మాట్లాడి వైద్యసేవలు, ఉద్యోగుల ప్రవర్తనపై ఆరాతీశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ వైద్యసేవలతో పాటు శారీరక ఉపశమనం, మానసిక ప్రశాంతత లభించేలా ఈ కేంద్రం ఉద్యోగులు సేవలందించాలని సూచించారు. ఆతర్వాత ఎన్‌సీడీ క్లినిక్, కీమోథెరపీ వార్డులను పరిశీలించి వైద్యసేవలపై సూచనలు చేశారు. అనంతరం తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌ను కూడా తనిఖీ చేసిన ఆయన నివేదికల్లో ఆలస్యం జరగకుండా పరీక్షలు నిర్వహించాలనితెలిపారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ఆధార్ ఆధారిత హాజరు నమోదు చేయాలని సూచించారు. ఎన్‌సీడీ జిల్లా కోఆర్డినేటర్లు సత్యనారాయణ, పులి మురళితో పాటు వైద్యులు రిషిత, అనూష, ఉద్యోగులు సుజాత, రత్నం, మన్మధరావు, మక్బూల్ పాషా తదితరులు పాల్గొన్నారు.
హైవేలకు నిధులు విడుదల చేయండి
హైవేలకు నిధులు విడుదల చేయండి


