ఇమేజ్.. డ్యామేజ్ కావొద్దని..
కేటాయించిన గుర్తులు ఇవే..
మొదటి విడత అభ్యర్థులకు
గుర్తుల కేటాయింపు
గుర్తులను జనంలోకి తీసుకెళ్లేలా
కసరత్తు
వాల్‌పోస్టర్లు, డోర్ స్టిక్కర్ల ముద్రణ..
చిన్న ఆకారాల్లో తయారీకి శ్రీకారం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో గుర్తులు కీలక భూమిక పోషించనున్నాయి. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కాకపోవడం.. ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులను జనంలోకి తీసుకెళ్లేలా అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక గుర్తుల కేటాయింపు పూర్తయింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డుమెంబర్లకు 20 గుర్తులను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. వీటిని జనానికి వివరించేలా అభ్యర్థులు వాల్‌పోస్టర్లు, డోర్ స్టిక్కర్ల ద్వారా ప్రచార రంగంలోకి దిగారు. గ్రామంలో ఇమేజ్ ఉన్నా గుర్తులను ఓటర్లు తేల్చుకోలేకపోతే డ్యామేజ్ అవుతామన్న భయంతో ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
అక్షర క్రమంలో గుర్తులు
మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తికాగా అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు. నామినేషన్ సమయాన అభ్యర్థులు ఇచ్చిన పత్రంలో రాసిన పేరులోని తెలుగు అక్షర క్రమం ఆధారంగా గుర్తుల కేటాయింపు పూర్తయింది.
ప్రచారానికి సిద్ధం
గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా పార్టీలు మాత్రం తమ శ్రేణులను బరిలోకి దింపాయి. ఫలితంగా పార్టీల గుర్తులు కాక కొత్తవి ఉండడంతో ఓటర్లలోకి తీసుకెళ్లడం అభ్యర్థులకు సవాల్‌గా మారింది. దీంతో అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో వాల్‌పోస్టర్లు, డోర్ స్టిక్కర్ల ముద్రణపై దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ప్రచారాన్ని ప్రారంభించిన అభ్యర్థులు తమ ఫొటో, గుర్తుతో కూడిన స్టిక్కర్లు, వాల్‌పోస్టర్లను ప్రతీ ఇంటి వద్ద అతికిస్తున్నారు. అలాగే, గుర్తులతో కూడిన చిన్న ఆకారాలను తయారుచేయించి ఓటర్లను కలిసి తమ గుర్తును చూపిస్తూ ఓటు వేయాలని పదేపదే చెబుతున్నారు.
ఐదు రోజులే గడువు
మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మరో ఐదు రోజుల సమయం ఉంది. ఈ సమయాన్ని వీలైనంతగా వినియోగించుకుని ప్రజల్లోకి తమ గుర్తును బలంగా తీసుకెళ్లే మార్గాలను అభ్యర్థులు అనుసరిస్తున్నారు. కొన్నిచోట్ల గుర్తుతో కూడిన ఆకారాలను తయారు చేసి పంపిణీ ఆలోచనలో ఉన్నారు. గ్రామంలో అభ్యర్థికి మంచి గుర్తింపు, పేరు ఉన్నా ఓటర్లకు గుర్తు తెలియకపోతే పరిస్థితి ఏమిటన్న బెంగ వారిని వేధిస్తోంది. ఇదిలా ఉండగా రెండు, మూడో విడతల ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు కూడా గుర్తులపై ఆలోచనలో పడ్డారు. ఓటర్లలోకి గుర్తును త్వరగా ఎలా తీసుకెళ్లాలని ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు.
సర్పంచ్ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, స్పానర్, చెత్తడబ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మన్, మనిషి తెరచాపతో పడవ, బిస్కెట్, వేణువు, చెయిన్, చెప్పులు, గాలిబుడగ, క్రికెట్ స్టంప్ గుర్తులతో జాబితా విడుదల చేసింది. ఇక వార్డుసభ్యులకు గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలెండర్, బీరువా, ఈల, కుండ, డిష్‌యాంటెనా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీమ్, గాజుగ్లాస్, పోస్టు డబ్బా, కవరు, హాకీ స్టిక్ బంతి, నెక్‌టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కెటిల్ గుర్తులు ఉన్నాయి. సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ పత్రాన్ని గులాబీ రంగు పేపర్‌పై, వార్డు సభ్యులకు తెల్ల రంగు బ్యాలెట్ పేపర్‌పై ముద్రించారు.


