గిరిజన మార్టులు వస్తే...
తొలుత భద్రాచలంలో ఏర్పాటు చేయాలి
● ఏజెన్సీ ఉత్పత్తులకు మరింత ఆదరణ ● అడవి బిడ్డలకు ఉపాధి అవకాశాలు మెరుగు ● ఇప్పటికే దేశవిదేశాల్లో ‘గిరిజన’ మిల్లెట్స్ ఖ్యాతి ● సీఎం నుంచి పీఎం వరకు ప్రశంసలు
భద్రాచలం: గిరిజన ఉత్పత్తుల ఖ్యాతి దేశ విదేశాలకు వ్యాపిస్తోంది. గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్స్ ఆహార ఉత్పత్తులను దేశ ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో ప్రత్యేకంగా అభినందించిన విషయం విదితమే. తాజాగా రాష్ట్ర, దేశ రాజధానులలో ఇప్పపువ్వు ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఏజెన్సీలోని మారుమూల మహిళలు గిరిజన సంప్రదాయ ఆహారాన్ని ఢిల్లీస్థాయికి తీసుకెళ్లి వన్నె తెస్తున్నారు. విదేశాలకూ సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన ఉత్పత్తులు అన్ని ఒకేచోట లభించేలా గిరిజన మార్టుల ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఏజెన్సీ నుంచి ఢిల్లీ దాక..
ఆదివాసీ సంప్రదాయ దినుసులతో ఆర్గానిక్ మిల్లెట్స్ బిస్కెట్లను గ్రూప్ లీడర్ తాటి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఐటీడీఏ సహాయ సహకారాలతో తయారీ ప్రారంభించారు. వీటిని ఢిల్లీ, హైదరాబాద్‌లలో కూడా ప్రదర్శించి గిరిజన రుచులను చూపించారు. మన్‌కీబాత్‌లో పీఎం నరేంద్ర మోదీ సైతం వీరి పేర్లను ప్రస్తావించి ప్రత్యేకంగా అభినందించారు. దీంతో దేశవ్యాప్తంగా మహిళల శక్తి మార్మోగింది. మూడు రోజుల క్రితం ఢిల్లీలో మినిస్టరీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఎఫైర్స్ తరఫున న్యూఢిల్లీలో జరిగిన ట్రైబల్ వెల్ఫేర్ కాంక్లేవ్–2025లో భద్రాచలానికి చెందిన స్వయం సహాయక సంఘం మహిళలు పాల్గొన్నారు. ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ గ్రూప్‌నకు సంబంధించిన గిరిజనులు ఇప్పపువ్వుతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇప్పపువ్వు లడ్డూలు, బర్ఫీ, టీపొడి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. వీటిని రుచి చూసిన కేంద్ర గిరిజన శాఖ మంత్రి జోయల్ ఓరం మెచ్చుకున్నారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందేలా తగిన సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో జరిగిన భారత్ సమ్మిట్‌లో భాగంగా భద్రాచలం ఐటీడీఏ యూనిట్ గిరిజన మహిళలు, డీఆర్‌డీఏకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. వెదురు, మిల్లెట్స్, ఇప్పపువ్వు ఉత్పత్తులు, కోయ సంప్రదాయ చిత్రాలు, క్రాఫ్ట్ తదితరాలను ఆహూతులు మెచ్చుకున్నారు. ప్రముఖ సినీ నటి, బ్లూక్రాస్ సంస్థ బాధ్యులు అక్కినేని అమల సైతం ప్రత్యేకంగా అభినందించారు. ఇలా రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధాని వరకు గిరిజన మహిళల ఉత్పత్తులు ఆదరణ పొందుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని..
గిరిజన ఉత్పత్తులు ఢిల్లీ స్థాయిలో ఖ్యాతి సాధిస్తున్నా రాష్ట్రంలో వ్యాపార విస్తరణ జరగడంలేదు. గిరిజనులు మిల్లెట్ బిస్కెట్లు, ఇప్పపువ్వు ఆహార ఉత్పత్తులు, సబ్బులు, షాంపులతోపాటు వెదురు బొమ్మలు, వస్తువులు తయారు చేస్తారు. ఇక అడవిలో గిరిజనులు సేకరించే తేనె, ఇప్పపువ్వు, కుంకుడు వంటి ఉత్పత్తులను కూడా నగర ప్రజలు ఇష్టపడతారు. వీటి విక్రయాల కోసం ఏజెన్సీలో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) డిపోలను ఏర్పాటు చేసినా అవి కొన్ని ఏరియాలకే పరిమతమయ్యాయి. దేశ, విదేశాల్లో గిరిజన ఉత్పత్తులకు ఖ్యాతి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో గిరిజన మార్టులను ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఇటీవల ఖమ్మంలో ప్రారంభించిన మహిళా మార్ట్ సత్ఫలితాలనిచ్చింది. ఇదే తరహాలో గిరిజన మార్టులు ఏర్పాటు చేస్తే ఉపాధి, అభివృద్ధి జరుగుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఆ దిశగా జిల్లా ఉన్నతాధికారులు, ఐటీడీఏ పీఓ, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గిరిజనులు కోరుతున్నారు.
గిరిజన ఉత్పత్తులను ఒకేచోటకు చేర్చి విక్రయించేలా గిరిజన మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలి. దీని ద్వారా కొండరెడ్లు, ఇతర గిరిజనులకు స్వయం ఉపాధి లభిస్తుంది. తొలుత భద్రాచలంలోని మాడ వీధుల నిర్వాసితులకు కేటాయిస్తున్న భూమిలో ముందు భాగంలో గిరిజన మార్టు ఏర్పాటు చేయాలి.
– ముర్ల రమేష్, కొండరెడ్ల సంఘ
వ్యవస్థాపక అధ్యక్షుడు
గిరిజన మార్టులు వస్తే...
గిరిజన మార్టులు వస్తే...


