సమస్యల పరిష్కారానికి కృషి
● వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖమ్మంఅర్బన్/రఘునాథపాలెం : ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రఘునాథపాలెం మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. ఈర్లపూడి, పంగిడి ఎస్సీ కాలనీల్లో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగలు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అధికారులతో చర్చించారు. గ్రామాల్లో అవసరమైన విద్యుత్ స్తంభాలకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలున్న రైతులకు ప్రభుత్వం అందించే అన్ని పథకాలు వర్తింపజేయాలన్నారు.
పొలంబాట పట్టిన తుమ్మల..
తన పర్యటన సందర్భంగా పలుచోట్ల ఆగిన మంత్రి తుమ్మల.. రైతులతో ముచ్చటిస్తూ పంటలను పరిశీలించారు. పత్తి, మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు చేసి మంచి ఆదాయం పొందాలని సూచించారు. పామాయిల్ మొక్కల పెంపకానికి అవసరమైన డ్రిప్ పద్ధతి, ఎరువులపై ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలోనే నేతలు, ఉద్యాన శాఖ అధికారులు పామాయిల్ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీజ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, జిల్లా వ్యవసాయ, సహకార, ఉద్యాన అధికారులు జి.పుల్లయ్య, గంగాధర్, మధుసూదన్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకూబ్, ఆర్డీఓ నర్సింహారావు, పంచాయతీరాజ్ డీఈ మహేష్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు మానుకొండ రాధాకిషోర్, వాంకుడోత్ దీపక్, భూక్యా బాలాజీ, దేవ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
నెహ్రూకు ఘన నివాళి..
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మంత్రి తుమ్మల ఘనంగా నివాళులర్పించారు. నయాబజార్ సెంటర్‌లో నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేశారు.
పామాయిల్ ఫ్యాక్టరీ పనుల పరిశీలన
కొణిజర్ల: పామాయిల్ సాగుతో రైతులకు లాభాల పంట పండుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని అంజనాపురం సమీపంలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో ఆరు మండలాల్లో పంట సాగు అధికంగా ఉన్నందున ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే జనవరి నాటికి పనులు పూర్తి చేయాలని గోద్రేజ్ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా మరో 700 మందికి ఉపాఽధి లభిస్తుందన్నారు. రిఫైనింగ్ ఫ్యాక్టరీ కూడా అంజనాపురంలోనే ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో 14 ప్రైవేట్, ఏడు ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, ప్రస్తుతం 2.75లక్షల ఎకరాల్లో పామాయిల్ పంట సాగవుతోందని వివరించారు. ఇతర పంటల కంటే అధిక ఆదాయం వస్తుందని, కోతులు, అడవి పందుల బెడద ఉండదని అన్నారు.


