నిర్లక్ష్యం వహిస్తే చర్య తప్పదు
ఖమ్మంసహకారనగర్: భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను హెచ్చరించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు – పరిష్కారంపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భూభారతి దరఖాస్తులు, పెండింగ్ సాదా బైనామా, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. గతంలో పలుమార్లు చెప్పినా కొన్ని మండలాల్లో సరైన పురోగతి లేదన్నారు. పెండింగ్ దరఖాస్తులు పరిష్కారం అయ్యే వరకు సెలవు రోజుల్లోనూ పూర్తి స్థాయిలో పని చేయాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన వెంటనే ప్రారంభించాలని, అర్హత లేని దరఖాస్తులను తిరస్కరించి ఆర్డీఓకు ఫార్వార్డ్ చేయాలని అన్నారు. తిరస్కరణకు గల కారణాలు స్పష్టంగా తెలియజేస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ మండలంలో 2 నుంచి 3 బయోమెట్రిక్ డివైజ్‌ల ద్వారా పెండింగ్ దరఖాస్తుల స్క్రూటినీ పూర్తి చేయాలన్నారు.
ప్రమాదాల నియంత్రణకు కార్యాచరణ..
ఖమ్మంఅర్బన్: నగరంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం నగర పరిధిలో 20 బ్లాక్‌స్పాట్లను గుర్తించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో వెంటనే సైన్‌బోర్డులు, లైన్ మార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లైన్ మార్కింగ్‌తో ట్రాఫిక్ నియంత్రణకు అవకాశం ఉంటుందని, దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధాన జంక్షన్ల వద్ద రోడ్లపై ‘గో స్లో’ వైట్ మార్కింగ్ వేయాలన్నారు. ఖమ్మం బైపాస్ రోడ్ – దానవాయిగూడెం నుంచి రామన్నపేట వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకూబ్, ఈఈలు పవార్, రంజిత్, బుగ్గయ్య, మున్సిపల్ డీఈ ధరణి పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


