సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
వైరా : వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సుమారు 4 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ముందుగా పది మంది డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాల్లో సిబ్బంది సెల్‌ఫోన్‌లు స్వాఽధీనం చేసుకున్నారు. ఒక్కొక్కరినీ విచారిస్తూ ఫోన్ పే లావాదేవీలను పరిశీలించారు. ఓ రైటర్ వద్ద రూ. 2.50లక్షలకు పైగా లభించగా విచారణ చేపట్టారు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఫోన్ పే వివరాలు సైతం పరిశీలించారు. సిబ్బందిలో ఒకరి ఫోన్ పే ద్వారా రూ.లక్షకు పైగా బదలాయించిన అధికారులు.. ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ కార్తీక్ ఫోన్‌ను సైతం తనిఖీ చేశారు. కార్యాలయంలో రోజుకు ఎన్ని డాక్యుమెంట్లు వస్తున్నాయి, ఎంత ఆదాయం వస్తుంది, స్లాట్ బుకింగ్ తదితర వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ.. గతంలో ఈ కార్యాలయంపై ఫిర్యాదులు వచ్చాయని, ప్రస్తుతం చేస్తున్నవి సాధారణ తనిఖీలేనని చెప్పారు. కార్యాలయ సిబ్బంది ఫోన్‌పే ద్వారా రూ.లక్షల్లో నగదు బదిలీ అయినట్లు, రిజిస్ట్రేషన్ పూర్తయిన డాక్యుమెంట్లను భూ యజమానులకు ఇవ్వకుండా వెండర్ల వద్దే ఉంచినట్లు గుర్తించామని చెప్పారు. రికార్డులు, ఫోన్ పే వివరాలు పరిశీలిస్తున్నామని, పూర్తి స్థాయి తనిఖీల అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఉలిక్కిపడిన రైటర్లు..
వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల బృందం 15 మంది ఒకేసారి తనిఖీలు చేపట్టడంతో డాక్యుమెంట్ రైటర్లు ఉలిక్కిపడ్డారు. కార్యాలయంలో ఉన్న నగదును ఇతరుల ద్వారా బయటకు పంపించగా, డాక్యుమెంట్ రైటర్లకు కార్యాలయ సిబ్బందికి మధ్యవర్తులుగా ఉన్నవారు ఆ ప్రాంతంలో కనిపించకుండా వెళ్లారు. ఓ వైపు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగానే.. రిజిస్ట్రేషన్‌ల కార్యక్రమాన్ని కూడా కొనసాగించారు. అయితే పలువురు డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలను మూసి వెళ్లడం గమనార్హం.
ఫైళ్లు పరిశీలన.. సెల్‌ఫోన్‌లు స్వాధీనం


