ఖమ్మంలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొని, రాత్రికి ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో బస చేయనున్నారు.
డీసీసీబీలో సహకార వారోత్సవాలు
ఖమ్మంవ్యవసాయం: అఖిల భారత 72వ సహకార వారోత్సవాలను ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డీసీసీబీ అధ్యక్షుడు దొండపాటి వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరించగా.. బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తామని ఉద్యోగులు, ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కాకతీయ సహకార శిక్షణ కేంద్రం వరంగల్ వైస్ ప్రిన్సిపాల్ రాజయ్య, జిల్లా సహకార అధికారి జి.గంగాధర్, బ్యాంక్ సీఈఓ ఎన్. వెంకట ఆదిత్య, భద్రాద్రి జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ డీఈగా బాధ్యతల స్వీకరణ
మధిర: నూతనంగా ఏర్పాటైన మధిర విద్యుత్ డివిజన్ తొలి డీఈగా బండి శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాలను కలుపుతూ మధిర కేంద్రంగా విద్యుత్ శాఖ కొత్త డివిజన్ ఏర్పాటైంది. డీఈగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావును ఏడీఈ అనురాధ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఖమ్మం టౌన్ డీఈ రామారావు, వైరా సబ్‌డివిజన్ ఏడీఈ కిరణ్, ముదిగొండ ఏడీఈ సత్యనారాయణ, బోనకల్ నూతన ఏడీఈ ఆనంద్‌తో పాటు పలువురు ఉద్యోగులు అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మధిరలో విద్యుత్ డివిజన్ ఏర్పాటుతో ప్రజలకు వేగంగా సేవలు అందుతాయని అన్నారు.
డీఈగా బాధ్యతలు చేపట్టిన బాబూరావు
వైరా: ట్రాన్స్‌కో వైరా సబ్ డివిజన్ డీఈగా వి.చిన్న బాబూరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడి డీఈ శ్రీనివాసరావు మధిర సబ్ డివిజన్ డీఈగా బదిలీ కాగా, ఆయన స్థానంలో ఖమ్మం టెక్నికల్ డీఈ బాబూరావు బదిలీపై వైరా వచ్చారు.
‘ఎవ్రీ చైల్డ్ రీడ్’ను
విజయవంతం చేయాలి
జిల్లా ప్రత్యేకాధికారి చందన్‌కుమార్
కారేపల్లి: కలెక్టర్ అనుదీప్ ప్రతిష్టాత్మంకగా ప్రవేశపెట్టిన ఎవ్రీ చైల్డ్ రీడ్(ఈసీఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి చందన్‌కుమార్ అన్నారు. మండలంలోని భీక్యాతండా ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సృజనాత్మకత మెండుగా ఉంటుందని, వాటిని వెలికితీసి మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. అనంతరం స్థానిక కేజీబీవీ, మైనార్టీ బాలికల గురుకుల విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ డి.జయరాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రి లక్ష్మణ్ పర్యటన
భద్రాచలంటౌన్ : రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం భద్రాచలంలో పర్యటించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో మధ్యాహ్నం జరిగే రాష్ట్రస్థాయి జన్ జాతీయ గౌరవ దివస్‌తో పాటు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలకు హాజరవుతారని వివరించారు. అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరంలో సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.
ఖమ్మంలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన


