321 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లకు 321 కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ తెలిపారు. అయితే, ఐదు కేంద్రాల ద్వారా బుధవారం నాటికి 203 మెట్రిక్ టన్నుల ‘ఏ’ గ్రేడ్ ధాన్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడించారు. ఈ ధాన్యం విలువ రూ.48,49,670గా నమోదైందని తెలిపారు. జిల్లాలోని పలు కేంద్రాలను పరిశీలించిన ఆయన సిబ్బందికి సూచనలు చేసి మాట్లాడారు. ధాన్యం కాంటా వేశాక ట్యాగ్ చేసిన మిల్లులకు మాత్రమే తరలించాలని స్పష్టం చేశారు. అంతేకాక అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.


