టిప్పర్లు.. తగ్గేదేలే | - | Sakshi
Sakshi News home page

టిప్పర్లు.. తగ్గేదేలే

Nov 6 2025 8:20 AM | Updated on Nov 6 2025 8:20 AM

టిప్ప

టిప్పర్లు.. తగ్గేదేలే

బొగ్గు రవాణాకు వద్దన్నా వినియోగం

అధిక లోడు, వేగంతో ప్రమాదాలు

సత్తుపల్లి – కొత్తగూడెం మార్గంలో భయంభయం

సత్తుపల్లి: సత్తుపల్లిలోని జేవీఆర్‌, కిష్టారం ఓసీల నుంచి కొత్తగూడెంలోని రుద్రంపూర్‌ కోల్‌హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌(ఆర్‌సీహెచ్‌పి)కు బొగ్గు తరలించే టిప్పర్ల అతివేగం మిగతా వాహనదారులకు ప్రాణసంకటంగా మారుతోంది. బొగ్గు టిప్పర్లతో ప్రాణహాని ఉండడమే కాక పర్యావరణం దెబ్బతింటోందనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సింగరేణి, రైల్వే శాఖ సంయుక్తంగా రూ.150 కోట్లతో రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టింది. దీంతో రోజుకు ఏడు నుంచి ఎనిమిది రేకులతో బొగ్గు రవాణా చేస్తున్నారు. దీంతో దుమ్మ బాధ తగ్గిందని.. ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ బొగ్గు పేరుకుపోతుందనే సాకుతో తిరిగి టిప్పర్లకు అనుమతి ఇవ్వడంతో పాత పరిస్థితే పునరావృతమైంది. ఈక్రమాన రంగారెడ్డి జిల్లాలో టిప్పర్‌ కారణంగా జరిగిన ప్రమాదంతో సత్తుపల్లి నుంచి బొగ్గు రవాణాపై చర్చ మొదలైంది.

ఏడాది నుంచి టిప్పర్లతో..

రైలుమార్గం ప్రారంభమయ్యాక కొత్తగూడెంకు టిప్పర్ల ద్వారా బొగ్గు రవాణా నిలిపివేశారు. కానీ ఏడాది నుంచి బొగ్గు నిల్వలు పేరుకుపోతున్నాయనే కారణంతో కొత్తగూడెం ఆర్‌సీహెచ్‌పీకి తిరిగి టిప్పర్లకు తాత్కాలికంగా అనుమతిచ్చారు. స్థానిక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యాన ఆందోళనలు చేపట్టినప్పుడు తప్ప రవాణా నిరాటంకంగా సాగుతోంది. ఆపై మరో రెండేళ్ల పాటు టిప్పర్ల బొగ్గు రవాణా టెండర్లు పొడిగించారు. కొత్తగూడెం ఆర్‌సీహెచ్‌పీ నుంచి రైలు మార్గంలోనే కాకినాడ, విజయవాడ(వీటిపీఎస్‌)కు బొగ్గు రవాణా జరుగుతుండడం... అక్కడకు టిప్పర్ల ద్వారా బొగ్గు చేరవేస్తుండడంతో స్థానిక లారీలకు లోడింగ్‌ దక్కక యజమానులు అవస్థ పడుతున్నారు.

రెండు నిమిషాలకో టిప్పర్‌..

సత్తుపల్లి – కొత్తగూడెం మధ్య 60 కి.మీ. దూరం ఉంటుంది. ఈ మార్గంలో రెండు నిమిషాలకో టిప్పర్‌ చొప్పున బొగ్గు తీసుకుని పరుగులు తీస్తుంటాయి. సీరియల్‌ పోతుందని.. రోజుకు ఒక్కో టిప్పర్‌ నాలుగు నుంచి ఐదు ట్రిప్పులు వేయాల్సి రావడం, గంటన్నరలోపు గమ్యాన్ని చేరుకోవాలనే ఆతృతతో డ్రైవర్లు వేగంగా నడుపుతుండడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ మార్గంలో బొగ్గు టిప్పర్లు ఢీకొని అనేక మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రగాయాలతో మంచానికే పరిమితమయ్యారు. కిష్టారం నుంచి లంకపల్లి వరకు డివైడర్‌ ఉండడంతో ప్రమాదాలు తక్కువగానే జరుగుతున్నా.. ఆపై మండాలపాడు, లంకాసాగర్‌, ఎర్రగుంట, మద్దుకూరు, చండ్రుగొండ గ్రామాల వద్ద మితిమీరిన వేగం, మూల మలుపుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

35 టన్నుల లోడు

14 టైర్లు కలిగిన టిప్పర్‌ కేవలం 24 టన్నుల బొగ్గే రవాణా చేయాలి. కానీ సత్తుపల్లి జేవీఆర్‌ ఓసీ, కిష్టారం ఓసీల నుంచి బయలుదేరే టిప్పర్లలో 30 టన్నుల నుంచి 35 టన్నుల లోడ్‌ వేస్తున్నారు. ఈ విషయంలో ఆంక్షలు లేకపోవడం, రోజుకు 6 నుంచి 7వేల టన్నుల బొగ్గు తరలించాలనే లక్ష్యం ఉండడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓసీ నుంచి ఓసీకే బొగ్గు తరలిస్తున్నామంటూ అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధిక లోడ్‌, మితిమీరిన వేగంతో ప్రమాదాలకు తోడు రోడ్డు దెబ్బ తిని గతుకులమయంగా మారుతోంది. వీ.ఎం.బంజర పెట్రోల్‌బంక్‌ బైపాస్‌ మూలమలుపు వద్ద గోతులు ఏర్పడి నెలలు కావొస్తున్నా మరమ్మతులకు నోచుకోక వర్షం వస్తే చెరువును తలపిస్తోంది.

కమ్మేస్తున్న దుమ్ము..

బొగ్గు తరలించే సమయాన టిప్పర్ల నుంచి బొగ్గు పెళ్లలు రోడ్డుపై పడకుండా పట్టాలను కప్పాల్సి ఉంటుంది. కానీ త్వరగా వెళ్లాలనే ఆత్రుతతో పట్టాలను కప్పక బొగ్గు పెళ్లలు రోడ్డుపై పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అంతేకాక బొగ్గు దుమ్ము ఎగిసిపడుతుండడంతో వెనక వచ్చే ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బొగ్గు రవాణా టెండర్లలో విధిగా పట్టాలు పూర్తిగా కప్పాలనే నిబంధన ఉన్నా డ్రైవర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. బొగ్గు పెళ్లలతో పడిన మట్టిని తొలగించడానికి సింగరేణి సంస్థ చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రమాదాలు తగ్గడం లేదు. అంతేకాక నల్లటి దుమ్ము లేస్తుండడంతో శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశముందని తెలిసి కూడా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.

టిప్పర్లు.. తగ్గేదేలే1
1/1

టిప్పర్లు.. తగ్గేదేలే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement