రేపు జాబ్ మేళా
ఖమ్మం స్పోర్ట్స్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 7న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కె.శ్రీరాం తెలిపారు. టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్‌లో జరిగే జాబ్‌మేళాలో భారత్ హుండాయ్ కంపెనీ బాధ్యులు సేల్స్ కన్సల్టెంట్, సర్వీస్ అడ్వైజర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, ఏదైనా డిగ్రీ, బీటెక్ మెకానికల్ అర్హత ఉన్న వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఉదయం 10గంటలకు మొదలయ్యే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని, వివరాలకు 70369 02902 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
వ్యాక్సిన్లతో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ
ఖమ్మంవైద్యవిభాగం: గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు వైద్యుల సూచనల ప్రకారం తప్పనిసరి టీకాలు వేయించాలని జిల్లా వాక్సిన్ మేనేజర్ సీ.హెచ్.రమణ సూచించారు. ఖమ్మంలోని ముస్తఫానగర్, శ్రీనివాసనగర్, వెంకటేశ్వరనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం ఆయన వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పాటు టీకా నిల్వ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు టీకాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణకు టీకాలు వేస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, ప్రతీ బాలింత బిడ్డకు ముర్రుపాలు విధిగా ఇవ్వాలని తెలిపారు. కాగా, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సైతం టీకాలు, ముర్రుపాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రమేష్, సమీరా, ఉద్యోగులు పద్మజ, రజిత, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.


