నిలువెత్తు నిర్లక్ష్యం
ఆదేశాలు రావాల్సి ఉంది..
● రేషన్ దుకాణాల్లోనే దొడ్డు బియ్యం ● నిల్వలు వేయి మెట్రిక్ టన్నులకు పైగానే..
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా రేషన్ షాపుల నుంచి దొడ్డు బియ్యం నిల్వలు కదలడం లేదు. రోజుల తరబడి పట్టించుకోకపోవడంతో బియ్యానికి పురుగులు పట్టి పనికి రాని స్థితికి చేరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉగాదికి ముందు వరకు రేషన్‌షాపుల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేశారు. ఆపై ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యం అందిస్తున్నారు. అయితే, అప్పటివరకు రేషన్‌షాపుల్లో మిగిలిన దొడ్డు బియ్యం నిల్వలు అలాగే ఉండిపోయాయి. వీటిని వెనక్కి తీసుకోవడమా, వేలం వేయడమా అన్న అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అటు షాపులు, ఇటు గోదాముల్లో బియ్యానికి పురుగులు పడుతున్నాయి.
వెనక్కు తీసుకోక...
రేషన్‌షాపుల్లో మిగిలిన దొడ్డు బియ్యంను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోవటంతో నిల్వలు పేరుకపోయాయి. జిల్లాలోని 748 రేషన్ దుకాణాల్లో సుమారు 1040.368మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నట్లు అంచనా. అంతేకాక పలు గోదాముల్లోనూ దొడ్డు బియ్యం ఉన్నాయి. వీటి అమ్మడమా, వెనక్కి పంపడమా అన్న విషయమై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో డీలర్లు అడిగే ప్రశ్నలకు అధికారులు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే, ఏడు నెలలుగా బియ్యం ఉండడంతో స్థలం సమస్య ఏర్పడుతోందని, మరోపక్క తరుగు వస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని డీలర్లు వాపోతున్నారు. అలాగే, పురుగులు పట్టి ముక్కిపోతే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి.
రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్న మాట వాస్తవమే. అయితే, ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఉన్నతాధికారులకు ఇప్పటికే విషయాన్ని తెలియచేశాం. అక్కడి నుంచి స్పష్టత వస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – చందన్‌కుమార్,
జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి
నిలువెత్తు నిర్లక్ష్యం


