యాసంగికి రెడీ
యాసంగిపైనే ఆశలు
చివరి దశకు చేరిన వానాకాలం సాగు
యాసంగికి ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయశాఖ
4.16 లక్షల ఎకరాల్లో పంటలు
సాగవుతాయని అంచనా
●ఢోకా లేనట్టే..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వానాకాలం పంటల సాగు ముగింపు దశకు చేరింది. వరి కోతలు, పత్తి తీయడం కొనసాగుతున్న నేపథ్యాన రైతులు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, తుపాన్ ప్రభావంతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లోకి భారీగా నీరు చేరింది. దీంతో యాసంగిలో పంటల సాగుకు నీటి ఎద్దడి ఉండదనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. మరోపక్క జిల్లా వ్యవసాయ శాఖ సైతం యాసంగిలో అన్నీ కలిపి 4,16,609 ఎకరాల్లో పంటలు సాగవుతాయని ప్రణాళిక రూపొందించింది. నీటి లభ్యత ఉండడంతో రైతులు సన్న ధాన్యం సాగుకే సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నిండా నీరు..
వానాకాలంలో కురిసిన వర్షాలు, మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరింది. పాలేరు, వైరా రిజర్వాయర్, లంకాసాగర్ ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్ధ్యం 23 అడుగులు కాగా.. ప్రస్తుతం 22.75 అడుగుల మేరకు నీరు ఉంది. అంతేకాక సాగర్ ప్రాజెక్టు నుంచి 3,991 క్యూసెక్కులు, క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి 1,159 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇదే సమయాన 4,691 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదవుతోంది. ఇక వైరా రిజర్వాయర్ 18.03 అడుగులకు గాను 18.08 అడుగుల నీరు ఉండగా, 1,570 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,460 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. అంతేకాక 40 క్యూసెక్కులు నీటిని కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. అలాగే, లంకాసాగర్ ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్ 16 అడుగులకు 15.05 అడుగుల మేర నీరు ఉంది.
మత్తడి పోస్తున్న చెరువులు
జిల్లాలో 1,061 చెరువులు ఉండగా.. 75 శాతం చెరువుల్లో నీరు నిండుగా ఉంది. ఇంకా 768 చెరువులు 90 – 100 శాతం నిండగా.. 184 చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఆయా చెరువుల పరిధి ఆయకట్టు రైతులు యాసంగిలో పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. భారీ వర్షాలతో భూగర్భ జలాలు కూడా పెరిగేందుకు అవకాశం ఉండడంతో యాసంగిపై రైతుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది.
దెబ్బతీసిన వానాకాలం
వానాకాలం తొలినాళ్లలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో పంటల సాగు ఆశాజనకంగా మారింది. అయితే అల్పపీడనాల కారణంగా అతివృష్టితో కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. గత రెండు, మూడు నెలలుగా అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు వరి కోత దశకు చేరడం, పత్తి రెండో తీతకు సిద్ధమవుతుండగా మోంథా తుపాను రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. చేన్లలోనే పత్తి నీరు కారిపోగా.. తీసిన పత్తిలో తేమ పెరగడంతో పాటు నల్లబారింది. వరి పొలాలపైనే వాలడంతో చాలామంది రైతులకు వానాకాలం సాగు నష్టాల్లోకి నెట్టింది.
వానాకాలం పంటలు దెబ్బతినడంతో రైతులు యాసంగిపైనే ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువుల్లో జలకళ ఉట్టిపడుతున్న నేపథ్యాన రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో యాసంగిలో వరి సాగు తక్కువగా ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించినప్పటి నుంచి సాగు పెరుగుతోంది. ఈసారి కూడా యాసంగిలో సన్నధాన్యం సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ యాసంగి సాగుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక ప్రకారం అన్నీ కలిపి 4,16,609 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా.. అత్యధికంగా 2,46,988 ఎకరాల్లో వరి, 1,59,462 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. జల వనరులు ఉన్న ప్రాంతాలతోపాటు బోర్లు, బావుల కింద కూడా సాగుకు రైతులు రైతులు సిద్ధమవుతున్నారు.
జిల్లాలోని ప్రాజెక్టులు,
చెరువుల్లో జలసవ్వడి
యాసంగికి రెడీ


