
యాచకులు ఎందరు, ఎక్కడ?
ఆరు ప్రధాన ప్రశ్నలు
● కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వివరాలు సేకరణ ● బిక్షాటనకు కారణాలు, వారి జీవనశైలిపై ఆరా ● కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో సర్వే చేస్తున్న మెప్మా అధికారులు ● ఈనెల 16వ తేదీ నాటికి నివేదికలు సిద్ధం
ఖమ్మంమయూరిసెంటర్: రద్దీ ప్రాంతాల్లో, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లు, వీధుల వెంట బిక్షాటన చేస్తున్న వారి వివరాలు, వారి జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టణాలు, నగరాల్లో యాచకుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. యాచకుల జీవన శైలి, తీసుకుంటున్న ఆహారం, ఆరోగ్యం, యాచనకు కారణాలు తెలుసుకునేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక నమూనా రూపొందించింది. ఈ నమూనా ఆధారంగా ఖమ్మ ం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మధిర, సత్తుపల్లి, కల్లూరు, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మెప్మా అధికారులు, సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యం
మున్సిపాలిటీల పరిధిలో పేదరిక నిర్మూలన ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల పరిధిలో బిక్షాటనే జీవనాధారంగా గడిపే వారి సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతోంది. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా యాచకుల దరికి చేరడం లేదు. సరైన చిరునామాతో పాటు ఆధార్ కార్డు తదితర గుర్తింపు లేకపోవడం.. ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. దీంతో వీరి వివరాలు గుర్తించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పక్కాగా వివరాల నమోదు
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో బిక్షాటనే జీవనంగా బతుకుతున్న వారి వివరాల సేకరణకు కేంద్రప్రభుత్వం ‘మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్’ పేరుతో సర్వే చేయిస్తోంది. ఆదివారం ప్రారంభమైన సర్వే ఈనెల 16వరకు మెప్మా సీఓలు, ఆర్‌పీల ఆధ్వర్యాన కొనసాగుతుంది. కేఎంసీలో సోమవారం సర్వే తీరుతెన్నులపై దిశానిర్దేశం చేశారు. టీఎంసీ జి.సుజాత, సీఓలు రోజా, సల్మా, ఉపేంద్ర ఆర్పీలకు శిక్షణ ఇచ్చి, గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు.
బిక్షాటన ఎందుకు?
మెప్మా ఉద్యోగులు సర్వేలో బాగంగా యాచకుల పూర్తి వివరాలను సేకరించనున్నారు. పురుషులు / సీ్త్రలు, వయసు, కుటుంబ స్థితిగతులు, పెళ్లయిందా, విడాకులు తీసుకున్నారా.. పెళ్లయితే పిల్లలు ఎందరు, వారి వయస్సు, మతం, కులం తదితర వివరాలు ఆరా తీస్తున్నారు. అంతేకాక బిక్షాటనకు కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. దివ్యాంగులా, వృద్ధాప్యమే కారణమా, మాదకద్రవ్యాలను వాడుతున్నారా, చేతిలో పిల్లలతో చేస్తున్నారా.. మాతృభాష, రాత్రి ఎక్కడ నివాసముంటున్నారనే తదితర వివరాలను నమోదు చేసుకుంటారు.
యాచకుల వివరాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నమూనా విడుదల చేసింది. మొదటి, రెండో కేటగిరీల్లో యాచకుల వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలపై ప్రశ్నలు ఉన్నాయి. ఎవరైనా బలవంతం చేస్తున్నారా, లేక జీవనం కోసమే బిక్షాటన చేస్తున్నారా.. వచ్చే డబ్బులు ఎంత, ఆ డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారనే అంశాలను మూడో కేటగిరీలో పొందుపరిచారు. నాలుగో కేటగిరీ కింద చేయూతనిస్తే బిక్షాటన నిలిపేస్తారా, చదువు, నైపుణ్య శిక్షణపై ఆసక్తి ఉందా, బిక్షాటన నిలిపిస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉన్నాయి. ఐదో కేటగిరిలో యాచకుల ఆహారం, ఆరోగ్య పరిస్థితులు, ఆరో కేటగిరి ద్వారా జీవితంలో ఏం కావాలి, ప్రభుత్వం నుంచి సాయం ఆశిస్తున్నారా, ఎవరైనా దుర్భాషలాడారా అనే వివరాలు సేకరిస్తున్నారు.