
బీఏఎస్ బకాయిల భారం
బీఏఎస్ విద్యార్థుల ఇక్కట్లు
జిల్లాలో పాఠశాలల వారీగా బకాయిలు
● పాఠశాలలకు రావొద్దని యాజమాన్యాల అల్టిమేటం? ● ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు ● జిల్లాలో బకాయిలు రూ.9.41 కోట్లకు పైగానే..
ఖమ్మంమయూరిసెంటర్: దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బీఏఎస్(బెస్ట్ అవైలబుల్ స్కీం)ను అమలుచేస్తుంది. ఈ పథకం ద్వారా మెరుగైన బోధన, వసతి సౌకర్యాలు ప్రైవేట్ పాఠశాలలను ఎంపిక చేసి ఎస్సీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. వీరి ఫీజు, ఇతరత్రా ఖర్చులను ప్రభుత్వం పాఠశాలల యజమాన్యాలకు చెల్లిస్తోంది. కానీ కొన్నాళ్లుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడకపోవడంతో బకాయిలు పేరుకుపోయి నిర్వహణ భారంగా మారిందని యాజమాన్యాలు వాపోతున్నాయి. ఈ విద్యాసంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించబోమని చెప్పగా.. ప్రభుత్వ పెద్దల చర్చించి నచ్చచెప్పడంతో చివరకు పథకాన్ని కొనసాగించారు.
విద్యార్థుల అడ్డగింత
దళిత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలనే ప్రభుత్వ లక్ష్యం బకాయిలు కారణంగా నీరుగారిపోతోంది. ప్రభుత్వం నుంచి రూ.9.41 కోట్ల బకాయిలు నిలిచిపోవడంతో బీఏఎస్(బెస్ట్ అవైలబుల్ స్కీం) అమలవుతున్న పాఠశాలల యాజమాన్యాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను తరగతులకు రావొద్దని చెబుతున్నట్లు సమాచారం. దీంతో మెరుగైన విద్య దూరమవుతుందేమోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
బకాయిల భారం
జిల్లా పరిధిలోనే ఏడు పాఠశాలలు బీఏఎస్ పథకంలో నమోదు చేసుకోగా.. విద్యార్థులకు ఫీజులకు సంబంధించి రూ.9.41 కోట్ల బకాయిలు ఉన్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫలితంగా విద్యార్థులకు భోజనం, వసతి, విద్యుత్ బిల్లులు, ఉపాధ్యాయుల జీతాలు చెల్లింపులో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే పాఠశాలను నడపడం కష్టమని.. బకాయిలు చెల్లించాకే విద్యార్థులను అనుమతిస్తామని యాజమాన్య ప్రతినిధులు అధికారుల వద్ద స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, అధికారుల సూచనతో విద్యార్థులను అనుమతించినా... బుక్స్, ఇతర సామగ్రిని మాత్రం అందించడం లేదని తెలుస్తోంది.
గతంలో పాఠశాలలో చేరిన వెంటనే బుక్స్, యూనిఫామ్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం పిల్లలను పాఠశాలలకే రావొద్దని చెబుతున్నారు. బకాయిల విషయంలో ప్రభుత్వ ఊదాసీనత పిల్లల భవిష్యత్‌కు ఇబ్బందిగా మారుతోంది. ఇకనైనా సమస్యను పరిష్కరించాలి. – ఎం.లక్ష్మణ్, విద్యార్థి తండ్రి, ఖమ్మం
ప్రభుత్వ నిర్లక్ష్యంతో దళిత విద్యార్థులకు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. బీఏఎస్ బకాయిలు చెల్లించకపోతే 1,300 మంది నష్టపోయే అవకాశముంది. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడమే కాక యాజమాన్యాల నుంచి బుక్స్, యూనిఫామ్స్ ఇప్పించాలి. – తుడుం ప్రవీణ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి
సత్తుపల్లిరూరల్: బెస్ట్ అవైలబుల్ పథకం నిధులు రాకపోవడంతో పాఠశాల నిర్వహణ భారంగా మారిందని పాఠశాలల యాజమాన్య బాధ్యులు వాపోతున్నారు.యారు. ఈమేరకు ఓ పాఠశాల బాధ్యులు చేసేదేం లేక తల్లిదండ్రులైనా ఫీజు చెల్లించాలని ఇటీవల సమాచారం ఇచ్చారు. ఏళ్లుగా ప్రభుత్వం నుంచి బకాయిలు
రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈమేరకు తల్లిదండ్రులు శుక్రవారం
ఎంఈఓ నక్కా రాజేశ్వరరావుకు వినతిపత్రం అందించగా, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
పాఠశాల విద్యార్థులు పెండింగ్ బకాయి
బేబీమూన్ హైస్కూల్, ఖమ్మం 584 రూ.3,03,80,000
సెంచరీ హై ప్రొఫైల్ స్కూల్, ఖమ్మం 284 రూ.1,92,34,400
హార్వెస్ట్ హైస్కూల్, ఖమ్మం 42 రూ.17,82,200
వి.వి.విద్యాలయం, సత్తుపల్లి 63 రూ.67,32,800
సెయింట్ అలోషియస్, తనికెళ్ల 115 రూ.84,23,640
సెయింట్ ఆన్స్, బనిగండ్లపాడు 87 రూ.1,21,57,200
సెయింట్ జోసెఫ్స్, ఖమ్మం 132 రూ.1,54,77,600
మొత్తం 1,307 రూ.9,41,87,840

బీఏఎస్ బకాయిల భారం

బీఏఎస్ బకాయిల భారం