
‘సౌర’ పందెం.. రూ.కోటి ఖాయం
● ఉమ్మడి జిల్లాలో కొణిజర్ల, భద్రాచలం ఎంపిక ● ఎంఎన్‌ఆర్‌ఈ ద్వారా ప్రజలకు ఉపయోగపడేలా సోలార్ ప్లాంట్లు ● ‘గృహజ్యోతి’తో ఇంకా ముందుకు రాని ప్రజలు
ఖమ్మంవ్యవసాయం: సౌర విద్యుత్ ఉత్పత్తిని విస్తృతపర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలతో కూడిన పథకాలను అమలుచేస్తోంది. ప్రధాన మంత్రి సూర్యఘర్, ప్రధానమంత్రి కుసుమ్ వంటి పథకాలు ఉండగా.. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెనివబుల్ ఎనర్జీ(ఎంఎన్‌ఆర్‌ఈ) పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద మోడల్ సోలార్ విలేజ్‌లకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. నిబంధనల ఆధారంగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించిన గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడేలా ఈ నిధులు వినియోగిస్తారు. మోడల్ సోలార్ విలేజ్‌గా పరిగణించడానికి తాజా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5 వేలకు మించి ఉండాలి. ఇక 2025 ఏప్రిల్ నుంచి ఆరు నెలల కాలాన్ని గడువుగా నిర్దేశించగా.. ఈ సమయంలో నిబంధనల ప్రకారం అధికంగా సౌర విద్యుత్ కనెక్షన్లు, సామర్థ్యాన్ని బట్టి జిల్లాకు ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తారు. ఆ గ్రామానికి ఎంఎన్‌ఆర్‌ఈ పథకం కింద రూ. కోటి విలువైన సౌర ప్లాంట్ల నజరానా ప్రకటించారు. దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న ఈ పథకాన్ని ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 4 నుంచి అక్టోబర్ 3 వరకు, భద్రాద్రి జిల్లాలో ఏప్రిల్ 9 నుంచి అక్టోబర్ 8వరకు అమలు చేశారు. విద్యుత్ శాఖ పర్యవేక్షణలో రెడ్ కో సంస్థ ఈ పోటీలు నిర్వహించింది.
పోటీ పడిన గ్రామాలు 22..
ఎంఎన్‌ఆర్‌ఈ పథకం కింద నిబంధనల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 22 గ్రామాలు ఎంపికయ్యాయి. ఖమ్మం జిల్లాలో అన్నారుగూడెం(తల్లాడ మండలం), నేలకొండపల్లి, కొణిజర్ల, వల్లభి(ముదిగొండ మండలం), తనికెళ్ల(కొణిజర్ల మండలం), తల్లాడ, ముదిగొండ, కందుకూరు(వేంసూరు) గ్రామాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో అశ్వాపురం, భద్రాచలం, సారపాక, నాగినేనిప్రోలు(బూర్గంపాడు మండలం), రుద్రంపూర్(చుంచుపల్లి మండలం), దమ్మపేట, కూనవరం(మణుగూరు మండలం), ముల్కలపల్లి, బూర్గపాడు, చండ్రుగొండ, బాబూక్యాంప్(చుంచుపల్లి మండలం), మందలపల్లి(దమ్మపేట మండలం), సమితి సింగారం(మణుగూరు మండలం) చర్ల గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో అర్హులైన వారికి సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సూర్య ఘర్ పథకం కింద రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇంటి పైకప్పు 100 నుంచి 300 ఆపైన స్క్వేర్ ఫీట్ ఉన్న భవనాలకు అవకాశం కల్పించారు. ఒక కిలోవాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్‌కు రూ.30 వేల రాయితీ, 2 కిలోవాట్ల సౌరప్లాంట్‌కు రూ. 60 వేలు, 3 కిలోవాట్ల సౌరప్లాంట్‌కు రూ.78 వేల రాయితీ సౌకర్యం కల్పించారు.
రూ.కోటి నజరానా
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో నిర్వహించిన మోడల్ సోలార్ విలేజ్ పథకం పోటీల్లో ఖమ్మం జిల్లా నుంచి కొణిజర్ల, భద్రాద్రి జిల్లా నుంచి భద్రాచలం గ్రామాలు విజేతలుగా నిలిచాయి. భద్రాచలంలో 180 విద్యుత్ సర్వీసులు సౌర విద్యుత్‌కు అనుసంధానం పొందగా 2 వేల కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పునరుత్పత్తి చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల కూడా అత్యధికంగా పోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొని ముందంజలో నిలిచింది. దీంతో ఈ రెండు గ్రామాలను రెండు జిల్లాల స్థాయిలో మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపిక చేశారు. సోలార్ పథకం కింద విజేతలుగా నిలిచిన గ్రామాలకు విడుదల చేసే రూ. కోటి నిధులను ఆయా గ్రామాల్లో ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని నిర్దేశించారు.
ప్రభావం చూపుతున్న ‘గృహజ్యోతి’
రాష్ట్ర ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకరాన్ని గృహజ్యోతి పథకం కింద కల్పించింది. గ్రామాల్లో 80 శాతం మంది విద్యుత్ కనెక్షన్లు ఈ పథకంలో ఉన్నాయి. దీంతో ఉచిత విద్యుత్ పొందుతున్న లబ్ధిదారులు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. 3 కిలోవాట్ ప్లాంట్ ఏర్పాటుకు కంపెనీలను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.2.40 లక్షల వరకు ఖర్చవుతుంది. కిలోవాట్లు తగ్గితే వ్యయం కూడా తగ్గుతుంది. అయితే ఈ పథకం ఏర్పాటుకు రుణ సౌకర్యం కల్పించినా.. వినియోగదారులకు సిబిల్ స్కోర్ ఉంటేనే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. చాలా మందికి సిబిల్ స్కోర్ సరిగా లేక రుణాలకు అర్హత సాధించలేక పోయారు. దీంతో మోడల్ సోలార్ విలేజ్ పథకానికి అంతగా ఆసక్తి చూపడం లేదు.