
హామీలన్నీ అమలు చేస్తున్నాం
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా పాలన
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి
ఖమ్మంరూరల్ : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల పాలయినా, ఆర్థిక వ్యవస్థ సక్రమంగా లేకున్నా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజా పాలన సాగుతోందని చెప్పారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని చిన్న వెంకటగిరిలో ఖమ్మం – కోదాడ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి జీ ప్లస్ – 2 కాలనీ వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులకు ఆదివారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా దీవెనలతో ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రూ.1.53 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, రూ.2.65 కోట్లతో మినీ స్టేడియం నిర్మిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి సరఫరాకు రూ.10 లక్షలు ఖర్చు చేశామని చెప్పారు. వెంకటగిరి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి జంగాల కాలనీ, ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి నుంచి కోటనారాయణపురం మీదుగా ఇందిరమ్మ కాలనీ, వెంకటగిరి ఎస్సీ, బీసీ కాలనీ నుంచి గుదిమళ్ల వరకు రోడ్లు మంజూరు చేశామని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీలో అదనపు నిధులు మంజూరు చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం అక్కడే అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి.. త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్‌బాబు, ఖమ్మం ఆర్‌డీఓ నర్సింహారావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.