నేడు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు
ఖమ్మం సహకారనగర్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఐటీఐ కళాశాలలను ఏటీసీ(అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్)లుగా అప్‌గ్రేడ్ చేసింది. తొలి విడతలో రాష్ట్రంలో మూడు ఐటీఐలను ఏటీసీలుగా మార్చగా అందులో ఖమ్మం నగరంలోని టేకులపల్లి ఐటీఐ కూడా ఉంది. 2024 – 25 విద్యా సంవత్సరంలో ఈ సెంటర్‌కు ఆరు కొత్త కోర్సులు మంజూరయ్యాయి. వాటిలో గత, ప్రస్తుత విద్యాసంవత్సరాల్లో 172 చొప్పున సీట్లు కేటాయించగా అన్నీ భర్తీ అయ్యాయి.
రూ.13 కోట్లు కేటాయింపు..
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.77 కోట్లు కేటాయించగా పనులు పూర్తయ్యాయి. కాగా, టాటా టెక్నాలజీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మరో రూ.8 కోట్ల వ్యయంతో విద్యార్థులకు అవసరమైన పరికరాలు, ఫర్నిచర్, బోధన సిబ్బందిని సమకూరుస్తున్నారు. కళాశాలలో ఉన్న పాత భవనంలోనే ఇప్పటివరకు విద్యార్థులకు బోధన చేశారు. అయితే తరగతి గదులు, ఇతర సమస్యలు నెలకొన్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించారు. ఏటీసీ భవనం సోమవారం ప్రారంభమైతే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందనున్నాయి.
ఏర్పాట్లు పూర్తి..
నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏటీసీ భవనాన్ని ప్రారంభిస్తారని, ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరవుతారని ప్రిన్సిపాల్ ఎ.శ్రీనివాసరావు తెలిపారు. వీరితో పాటు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధిరెడ్డి, గారపాటి రేణుకా చౌదరి, రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీలు తాత మధుసూదన్, తీన్మార్ మల్లన్న, పింగళి శ్రీపాల్‌రెడ్డి, కలెక్టర్ అనుదీప్‌ను కూడా ఆహ్వానించామని వివరించారు.