
సుందర వనం !
కేఎంసీ పరిధిలో ఆహ్లాదంగా పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు
నగర వాసులకు ఆహ్లాదం పంచేలా మొక్కలు
ఈసారి ఆదాయం ఇచ్చే
మొక్కల పెంపకం కూడా..
ఖమ్మం నగరంలో పచ్చదనం పరిఢవిల్లుతోంది. నగర పాలక సంస్థ (కేఎంసీ) ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంతో పార్కులు, ప్రధాన రహదారులు, వాకింగ్ ట్రాక్‌లు, డివైడర్లు హరిత శోభ సంతరించుకుని ఆహ్లాదం పంచుతున్నాయి. వన మహోత్సవంలో లక్ష్యాలకు అనుగుణంగా వివిధ శాఖల అధికారులు రకరకాల మొక్కలు నాటడంతో పచ్చదనంతో నిండిపోయాయి. నాటిన ప్రతీ మొక్క సంరక్షణకు కేఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. – ఖమ్మంమయూరిసెంటర్
ఆకర్షణీయంగా మొక్కలు..
నగరంలోని పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, ట్యాంక్‌బండ్‌లు, రహదారుల వెంట, డివైడర్లలో మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నా రు. మొక్కలు నాటడం, వాటిని పెంచడంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య.. ఉద్యాన అధికారిణికి ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నారు. దీంతో డివైడర్లతో పాటు పార్కులు, వాకింగ్ ట్రాక్‌ల్లో మొక్కలను ఆకర్షణీయంగా పెంచుతున్నారు. పెరిగిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తున్నారు. పార్కులకు వచ్చే వారిని ఈ మొక్కలు కనువిందు చేస్తున్నాయి. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసే వారికి ఈ పచ్చటి వాతావరణం మానసిక ప్రశాంతతను అందిస్తోంది.
వక్క మొక్కలు కూడా..
ఈ ఏడాది నగరంలో 4 లక్షలకు పైగా మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 90 శాతం పూర్తి చేయగా.. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మరో రెండు పార్కుల్లో మొక్కలు నాటాల్సి ఉంది. అయితే ఈ ఏడాది పూలు, పండ్ల మొక్కలతో పాటు కేఎంసీకి ఆదాయం తీసుకొచ్చే మొక్కలకు అధికారులు ప్రాధాన్యత ఇచ్చి పలు ప్రదేశాల్లో నాటారు. నగరంలో 6వేల వక్క మొక్కలను ప్రత్యేకంగా నాటించారు. కేఎంసీ డంపింగ్ యార్డ్‌లోని ఖాళీ స్థలంలో అత్యధికంగా 10 వేల మొక్కలు ఒకే చోట నాటగా.. వీటిలో నీడనిచ్చేవి, పండ్ల మొక్కలు ఉన్నాయి. వీటి చుట్టూ బ్యాంబూ మొక్కలను బోర్డర్‌లా పెంచుతున్నారు. ఇక నగరంలో 36 కిలోమీటర్ల మేర ఉన్న డివైడర్ల మధ్య వక్క, టాల్ ప్లాంట్స్, కాగితపు పూల మొక్కలు నాటారు.
విజయవంతంగా వన మహోత్సవం..
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం ఖమ్మంలో విజయవంతమైందని అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటడంతో నగరంలో పచ్చదనపు విస్తీర్ణం పెరిగింది. మొక్కలు నాటడమే కాకుండా, వాటి సంరక్షణకు కేఎంసీ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు నగరానికే మణిహారంగా మారింది.
ఖమ్మంలో పరిఢవిల్లుతున్న పచ్చదనం

సుందర వనం !

సుందర వనం !