
పోలీసు కుటుంబాలకు వైద్యపరీక్షలు
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రవీణ్ ఈఎన్‌టి ఆస్పత్రి ఆధ్వర్యాన గురువారం ఏర్పాటుచేసిన శిబిరాన్ని సీపీ సునీల్‌దత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా వైద్యశిబిరం ఏర్పాటు చేయించామని తెలిపారు. నిత్యం విధినిర్వహణలో ఉండే పోలీసు సిబ్బందికి ఏ సమస్య వచ్చినా అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. అడిషనల్ డీసీపీలు ప్రసాద్‌రావు, రామానుజం, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు నర్సయ్య, సుశీల్‌సింగ్, సీఐ మోహన్‌బాబు, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సాంబశివరావు, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.
అన్నపూర్ణాదేవిగా అలివేలు మంగమ్మ
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నాలుగో రోజైన గురువారం అర్చకులు తెల్లవారుజామునే స్వామికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అమ్మ వార్ల ఉత్సవమూర్తుల వద్ద హోమ పూజలు చేశాక అలివేలు మంగ అమ్మ వారిని అన్నపూర్ణాదేవి అవతారంలో అలంకరించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ముఖ్య అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
సాగులో ఆధునికత అవసరం
వైరా: పంటల సాగులో రైతులు ఆధునిక విధానాలు అవలంబించాలని, తద్వారా ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ జె.హేమంత్‌కుమార్ సూచించారు. ఆధునిక సాగు పద్ధతులపై గురువారం వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. పత్తిలో అధిక సాంద్రత విధానం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం పలువురు శాస్త్రవేత్తలు ఆరోగ్యకరమైన పంటల సాగు, ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి, పంట మార్పిడి, ఎరువుల వినియోగంలో సమతుల్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మధిర వ్యవసాయ పరిఽశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ రుక్మిణీదేవి, ఫ్యాక్ట్ సంస్థ డిప్యూటీ మేనేజర్ సురేష్‌కుమార్‌రెడ్డి, వైరా కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సుచరితాదేవి తదితరులు పాల్గొన్నారు.
భూముల ధరలకు అనుగుణంగా విలువ
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మం సహకారనగర్: పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా మార్కెట్ విలువ సవరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన భూముల మార్కెట్ విలువ సవరణ, నిషేధిత భూముల జాబితా రిజిస్టర్, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, రేషన్ షాపుల పర్యవేక్షణ, హైవేలకు భూసేకరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో సర్వే నంబర్ వారీగా అధ్యయనం చేసి భూముల విలువ సవరణకు ప్రతిపాదించాలని తెలిపారు. హైవేలకు సేకరించిన భూముల మ్యూటేషన్ పూర్తి చేయాలని, భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని సూచించారు. అలాగే, రేషన్ షాపులను తహసీల్దార్లు తనిఖీ చేస్తూ డీలర్లు మాత్రమే నడిపేలా చూడాలని తెలిపారు. ఈసమావేశంలో జిల్లా రిజిస్ట్రార్ రవీందర్‌రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్‌కుమార్, ఆర్డీఓ నరసింహారావు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాసరావు, సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

అన్నపూర్ణాదేవిగా అలివేలు మంగమ్మ