
‘స్థానికం’లో బీఆర్‌ఎస్ సత్తా చాటుదాం..
ఖమ్మంవైరారోడ్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటేలా శ్రేణులు కృషి చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. ఖమ్మం నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో గురువారం ఖమ్మంలో పువ్వాడతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చలేక ఎన్నికల నిర్వహణకు భయపడుతోందని తెలిపారు. యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతుండగా రైతులకు పనిలేక లైన్‌లో నిలబడుతున్నారని చెప్పడం గర్హనీయమన్నారు. హామీల అమలులో విఫలమవడమేకాక మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కూలిపోయిందని చెబుతూనే హైదరాబాద్‌కు కాళేశ్వరం ద్వారా నీళ్లు తీసుకొచ్చేలా శంకుస్థాపన చేయడం ఏమిటని పువ్వాడ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బంధు, నిరుద్యోగ భృతి, 4వేల పింఛన్, ఆడపిల్లలకు స్కూటీలు, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం తదితర హామీలు విస్మరించిన విషయాన్ని బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాగా, కొందరు తనను ఎదుర్కొలేక ఖమ్మంకు రాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చేసేవరకు విశ్రమించనని పువ్వాడ తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ, మార్కెట్ మాజీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రరెడ్డితో పాటు నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, ఖమర్, కర్నాటి కృష్ణ, మక్బూల్, వీరూనాయక్, గుత్తా రవి, మెంతుల శ్రీశైలం, అమరగాని వెంకన్న, హరిప్రసాద్, లక్ష్మణ్‌నాయక్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పార్టీ శ్రేణులతో సమీక్షలో
మాజీ మంత్రి పువ్వాడ