
బస్సు ఎక్కు.. బహుమతి పట్టు!
ప్రయాణికులను ప్రోత్సహించేలా..
● దసరా వేళ ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ ● నిర్ణీత తేదీల్లో ప్రయాణించే వారికి అవకాశం ● లక్కీ డ్రా ద్వారా ముగ్గురికి నగదు బహుమతులు
ఖమ్మంమయూరిసెంటర్: ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. దసరా సెలవుల్లో స్వస్థలాలకు వెళ్లివచ్చే వారు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయించేలా లక్కీ డ్రా తీసుకొచ్చారు. రీజియన్ స్థాయిలో మూడే బహుమతులు ప్రకటించినా.. ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఈ సంఖ్య పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. దసరా సెలవుల సందర్భంగా ప్రయాణించే వారికి లక్కీ డ్రా ద్వారా నగదు బహుమతులు అందిస్తామన్న ప్రకటనతో మరింత మంది ఆర్టీసీ వైపు ఆకర్షితులవుతారని అంచనా వేస్తున్నారు.
పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ కాకుండా..
సెలవు రోజులైన ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఖమ్మం రీజియన్ డిపోలకు చెందిన డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి ఏసీ, నాన్ ఏసీ, రాజధాని బస్సుల్లో ప్రయాణించే వారు లక్కీ డ్రాకు అర్హత సాధిస్తారు. నిర్ణీత తేదీల్లో ఆయా బస్సుల్లో ప్రయాణించే వారు ప్రయాణం పూర్తయ్యాక తమ టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన బాక్స్‌ల్లో వేయాలి.
లక్కీ డ్రా ద్వారా ఎంపిక..
అన్ని డిపోల్లోని బాక్స్‌ల్లో వేసిన టికెట్లను ఖమ్మంకు చేరుస్తారు. అక్టోబర్ 8న ఖమ్మంలోని రీజినల్ మేనేజర్ కార్యాలయంలో తీసే డ్రా లో ఇందులో నుంచి ముగ్గురిని విజేతలుగా ప్రకటిస్తారు. వీరికి వరుసగా రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేల నగదు బహుమతులు అందిస్తామని అధికారులు వెల్లడించారు.
సెలవుల్లో సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు సురక్షితంగా చేరేలా ఆర్టీసీ ద్వారా అదనపు సర్వీసులు సమకూరుస్తున్నాం. ఇదే క్రమాన ఆర్టీసీని ఆశ్రయించిన వారిని ప్రోత్సహించేలా బహుమతులు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా ప్రకటించిన లక్కీ డ్రా స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోవాలి.
– ఏ.సరిరామ్, ఖమ్మం రీజినల్ మేనేజర్

బస్సు ఎక్కు.. బహుమతి పట్టు!

బస్సు ఎక్కు.. బహుమతి పట్టు!