
పాఠశాలలకు రేటింగ్ !
హెచ్‌ఎంలకు శిక్షణ పూర్తి
లక్ష్యం.. పాయింట్లు
● నిర్ణీత ప్రమాణాల ఆధారంగా కేటాయింపు ● జిల్లాలో ఇప్పటికే వేయి స్కూళ్ల రిజిస్ట్రేషన్ ● జాతీయ స్థాయిలో ఎంపికై తే రూ.లక్ష ప్రోత్సాహక నగదు
ఖమ్మం సహకారనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నాయి. ఇదే సమయాన నిర్వహణ మరింత మెరుగుపడేలా పాఠశాలల నడుమ పోటీతత్వం పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పరిశుభ్రమైన వాతావరణం, ఆహ్లాదం, మౌలిక వసతుల కల్పనలో ముందు నిలిచే పాఠశాలలకు నగదు పురస్కారాలు అందించేందుకు ‘స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ’ పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. నిర్ణీత ప్రమాణాల ఆధారంగా మార్కులు కేటాయించి.. ఆపై రేటింగ్ ఇస్తారు. తద్వారా కేంద్రప్రభుత్వం నుంచి నగదు ప్రోత్సాహకం అందనుంది.
30లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్
జిల్లాలోని 21 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,601 ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 866, ప్రాథమికోన్నత పాఠశాలలు 277, హైస్కూళ్లు 458 కొనసాగుతున్నాయి. ఈ స్కూళ్లన్నీ స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ కోసం పోటీ పడే అవకాశముంది. ఇందుకోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ నెల 30వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై మొత్తం 60ప్రశ్నలకు గాను 125పాయింట్లు సాధిస్తే 5 స్టార్ రేటింగ్ దక్కుతుంది. ఇప్పటివరకు జిల్లాలో వేయి వరకు పాఠశాలల రిజిస్ట్రేషన్ పూర్తయిందని అధికారులు తెలిపారు.
మూడు దశల్లో పరిశీలన
జిల్లా స్థాయిలో ప్రధానోపాధ్యాయులు పొందుపరిచిన సమాచారాన్ని కలెక్టర్, డీఈఓ, డీఎంహెచ్‌ఓ, ఇంజనీరింగ్ అధికారితో పాటు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ముగ్గురు ఉపాధ్యాయులతో కూడిన కమిటీ పరిశీలిస్తుంది. ఆతర్వాత మెరుగైన వసతులు ఉన్న సూళ్లకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. మూడు లేదంటే అంత కంటే ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఆరు గ్రామీణ ప్రాఠశాలలు, రెండు పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలను ఎంపిక చేయనున్నారు. ఆయా పాఠశాలలను రాష్ట్ర విద్యాశాఖ, వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయితీరాజ్ శాఖ, స్థానికసంస్థల సంచాలకులతో పాటు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఇద్దరు హైస్కూళ్ల హెచ్‌ఎంలతో కూడిన కమిటీ పరిశీలించి.. నాలుగు స్టార్ రేటింగ్‌పైన దక్కించుకున్న 14గ్రామీణ హైస్కూళ్లు, ఆరు పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలను ఎంపిక చేసి జాతీయ స్థాయికి ప్రతిపాదిస్తారు. వీటిని మరోమారు పరిశీలించి ఐదు స్టార్ రేటింగ్ కలిగిన 140 గ్రామీణ పాఠశాలలు, 60 పట్టణ ప్రాంతాల పాఠశాలలను జాతీయ స్థాయిలో ఉత్తమమైనవిగా ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన 200 పాఠశాలలకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి అందుతుంది.
స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్‌కు వివరాల నమోదుపై హెచ్‌ఎంలకు శిక్షణ ఇచ్చాం. జాతీయ స్థాయిలో 200 పాఠశాలలను ఎంపిక చేయనుండగా రూ.లక్ష నగదు బహుమతి అందుతుంది. ఆ నిధులు పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు ఉపయోగపడతాయి. అందుకే జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో స్కూళ్లు పోటీ పడేలా చూస్తున్నాం.
– బాబోజు ప్రవీణ్‌కుమార్,
కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్
ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, పచ్చదనం, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాన్ని మెరుగుపర్చడమే కాక పిల్లల్లో స్నేహపూరిత వాతావరణం పెంపొందించడం, విద్యార్థులకు వ్యక్తిగత, పాఠశాల పరిశుభ్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో తాగునీటి వినియోగానికి 22పాయింట్లు, మరుగుదొడ్ల నిర్వహణకు 27, సబ్బుతో చేతులు కడుక్కునే సౌకర్యం ఉంటే 14, ప్రవర్తన, మార్పునకు 20పాయింట్లు కేటా యిస్తారు. అలాగే, పచ్చదనం, పరిశుభ్రతకు 21 పాయింట్లు, పర్యావరణ క్లబ్‌ల ఏర్పాట్లు, ఎల్‌ఈడీల బల్బుల వినియోగం, మొక్కల సంరక్షణ, ప్లాస్టిక్ నివారణ తదితర అంశాలకు 21 కలిపి మొత్తం 125 పాయింట్లు ఉంటాయి. విభాగాల వారీగా ఫొటోలతో సహా వివరాలు పొందుపరిస్తే పాయింట్ల ఆధారంగా పాఠశాలలకు ఒకటి నుంచి ఐదు వరకు స్టార్ రేటింగ్ కేటాస్తారు.

పాఠశాలలకు రేటింగ్ !