
‘హరిత’భాగ్యం లేదా.. ?!
● రెండేళ్ల క్రితమే శంకుస్థాపన.. స్థలం సరిపోదని వాయిదా ● ప్రత్యామ్నాయం ఎంపికలో ఎడతెగని జాప్యం
ఖమ్మం రాపర్తినగర్: జిల్లా కేంద్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యాన హరిత హోటల్ నిర్మాణానికి ముందడుగు పడడం లేదు. రెండేళ్ల క్రితం రూ.5కోట్ల వ్యయంతో హోటల్ నిర్మించేలా కొత్త బస్టాండ్ సమీపాన స్థలాన్ని సేకరించారు. కానీ ఆ స్థలం అనువుగా లేదని పర్యాటక శాఖ తేల్చిచెప్పడంతో ప్రత్యామ్నాయ స్థలాల కోసం అన్వేషిస్తున్నా ఓ కొలిక్కి రావడం లేదు. ఫలితంగా ప్రభుత్వ పరంగా హోటల్ లేక జిల్లాకు వచ్చే ఇతర ప్రాంతాల వారు, పర్యాటకులు ప్రైవేట్ హోటళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
రెండెకరాలకు పైగా...
కొత్త బస్టాండ్ వద్ద హరిత హోటల్ నిర్మాణానికి గతంలో స్థలాన్ని గుర్తించారు. రెండేళ్ల క్రితం అప్పటి మంత్రి కేటీఆర్ కొత్త బస్టాండ్ సమీపాన శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఆ స్థలం 20 గుంటలే కావడంతో భవన నిర్మాణానికి సరిపోయినా పార్కింగ్, ఇతర అవసరాలకు ఇబ్బంది అవుతుందని పర్యాటక శాఖ అధికారులు నిరాకరించారు. ఆపై జిల్లా కేంద్రంలో రెండు నుంచి మూడెకరాల స్థలం కోసం ఆరాతీసినా ఫలితం కానరాలేదు. ఖానాపురం హవేలీ, రఘునాథపాలెం, వీ.వీ.పాలెం, దానవాయిగూడెం, వరంగల్ క్రాస్ రోడ్డు, జలగంనగర్ ప్రాంతాల్లో ఖాళీస్థలాలు ఉన్నప్పటికీ నగరానికి దూరమవుతుందని వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. చివరకు ఖాళీగా ఉన్న ఎన్నెస్పీ స్థలాలను ఎంపిక చేయాలనే భావనకు వచ్చి నట్లు తెలిసింది. ఈమేరకు జిల్లా కేంద్రంలోనే హోటల్ నిర్మాణానికి స్థలం గుర్తించాలని రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు సూచించినట్లు సమాచారం. అయితే, ఈ ప్రయత్నాల్లో జాప్యం జరుగుతుండడంతో హోటల్ ఎప్పుడు నిర్మిస్తారో తెలియరావడంలేదు. ఖాళీగా ఉన్న ఎన్నెస్పీ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నందున హరిత హోటల్ నిర్మాణాని కి కేటాయిస్తే అన్ని వసతులతో నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది. తద్వారా జిల్లాకు వచ్చే పర్యాటకులకే కాక ఇతరులకు వసతి సౌకర్యం అందుబాటులోకి రానుంది.