
సెలవులకు ఊరెళ్తున్నారా?!
● కొద్ది జాగ్రత్తలతో మీ సొత్తు భద్రం ● సూచనలు జారీ చేసిన పోలీసుశాఖ
ఖమ్మంక్రైం: విద్యాసంస్థలకు దసరా సెలవులు మొదలయ్యాయి. ఇంకోపక్క బతుకమ్మ సందడి ప్రారంభమైంది. దీంతో పిల్లలతో సహా కుటుంబాలు స్వగ్రామాలు లేదా విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరనున్నాయి. ఇదే అదునుగా దొంగలు తమ చేతులకు పదును పెట్టే అవకాశముంది. ఈ నేపథ్యాన కష్టపడి సంపాదించిన నగదు, ఆభరణాలు దొంగల పాలుకాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. పోలీసుశాఖ పరంగా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేశామని వెల్లడించిన ఆయన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
సీపీ జారీ చేసిన సూచనలు
●పేపర్లు, ఖాళీ సంచులు ఏరుకోవడం, ఇతర సామగ్రి అమ్మకం పేరిట వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తాళం వేసి ఉన్న ఇళ్ల వద్దకు ఒకటి, రెండు సార్లు ఎవరైనా వచ్చి వెళ్లినా అప్రమత్తం కావాలి.
●ఇళ్లలో వృద్ధులు ఉంటే అపరిచితులకు ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సూచించాలి. తరచుగా పరిశీలించాలని ఇరుగుపొరుగు వారికి తెలపాలి. వీరి ద్వారా తరచూ సమాచారం తెలుసుకోవాలి.
●ఇతర చోట్లకు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంట్లో పెట్టొద్దు. బ్యాంక్ లాకర్లలో పెట్టడం ద్వారా భద్రత ఉంటుంది. ఇంటికి తాళం వేసి చాలారోజులు వెళ్లాల్సి వస్తే సమీప పోలీసుస్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. తద్వారా సిబ్బంది గస్తీకి వచ్చినప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుంది.
●కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం. తద్వారా ఎక్కడ ఉన్నా సెల్‌ఫోన్‌లోనే తమ ఇంటి చుట్టూ జరుగుతున్న అంశాలను తెలుసుకోవచ్చు. అలాగే, అపార్ట్‌మెంట్లకు 24గంటల పాటు ఉండేలా వాచ్‌మెన్లను తప్పనిసరి నియమించుకోవాలి. అంతేకాక సమీప పోలీసుస్టేషన్‌తో పాటు పెట్రోలింగ్ సిబ్బంది ఫోన్ నంబర్లు తీసుకుంటే అనుమానితులు కనిపించినప్పుడు సమాచారం ఇవ్వడం వీలవుతుంది.
●బీరువా తాళాలు ఇంట్లో పెట్టకుండా వెంట తీసుకెళ్లాలి. ఇంటి తాళం కానరాకుండా చూస్కోవాలి. అలాగే, ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టం అమర్చుకోవడం సురక్షితం.