
ప్రకృతి ఆరాధన.. బతుకమ్మ
ఎంగిలిపూలతో ప్రారంభమై
సద్దులతో ముగియనున్న వేడుకలు
బతుకమ్మ నైవేద్యాలూ ప్రత్యేకమే..
ఆనందోత్సాహాలతో ఆడి, పాడనున్న ఆడబిడ్డలు
ఈ పండుగ ఎంతో ప్రత్యేకం
పూలను ఆరాధించే పండుగ
ఖమ్మంగాంధీచౌక్: సీ్త్ర శక్తిని గౌరవించే పండుగ.. ప్రకృతిని ఆరాధించడమే.. బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఈ పండుగ ప్రతీక. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలో ఇమిడి ఉంటుంది. ఆశ్వయుజ మాస శుద్ధ పాఢ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. గౌరి పండుగ, సద్దుల పండుగ, పూల పండుగగా పిలుచుకుంటారు. మహాలయ అమావాస్య ఆదివారం నుంచి ప్రారంభమయ్యే పండుగ దుర్గాష్టమితో ముగుస్తుంది. తెలంగాణ గ్రామీణ సమాజంలో నవాబులు, భూస్వాముల పెత్తందారీలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. ఆ అకృత్యాలకు ఆత్మహత్య చేసుకున్న మహిళలను తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే అని ప్రజల విశ్వాసం. కాగా, తెలంగాణ ఆవిర్భావం తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పండుగకు ప్రాధాన్యత పెరిగింది. గతంలో కొన్ని చోట్ల మాత్రమే బతుకమ్మ ఆడేవారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత వాడవాడనా ఉత్సవాలు జరుపుకుంటున్నారు.
తొమ్మిది రోజుల పండుగ
బతుకమ్మ పండుగకు పుష్పాలే కళ. వానాకాలం చివరిలో శీతాకాలం ఆరంభంలో ఈ పండుగ వస్తుంది. ఈ సమయంలో నీటితో నిండిన జలాశయాల్లో తామర, కలువ వంటి పూలు లభిస్తాయి. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, నంది వర్దనం పూలు పూస్తాయి. సీతా ఫలాలు లభిస్తాయి. జొన్న పంట కోత సమయం. ఆడబిడ్డలు అత్తవారి ఇంటి నుంచి కన్న వారింటికి వచ్చి ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవటం ప్రత్యేకత. తొమ్మిది రోజుల పాటు నిత్యం ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు నైవేద్యం తయారీలో యువతీ, యువకులు పాల్గొంటారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజున మహిళలు మాత్రమే నైవేద్యాన్ని తయారు చేస్తారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
●ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమావాస్య నుంచి ఎంగిలిపూల బతుకమ్మగా వేడుకలు ప్రారంభమవుతాయి. పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
●అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
●ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
●నాన బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేసి సమర్పిస్తారు.
●అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
●అలిగిన బతుకమ్మ: ఆశ్వయుజ పంచమి రోజున నిర్వహించే ఈ రోజున ఏ నైవేద్యాన్ని తయారు చేసి సమర్పించరు.
●వేపకాయల బతుకమ్మ: బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
●వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
●సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి. ఈ రోజున దుర్గాష్టమిని జరుపుకుంటారు. 5 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ కలిపిన అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.
బతుకమ్మ పండుగ అంటే ఎంతో ఇష్టం. ఇది ఆడబిడ్డల పండుగ. తెలంగాణ సంస్కృతికి ఈ పండుగ ప్రత్యేకం. పూర్వీకుల నుంచి వస్తున్న పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుతాం. నైవేద్యాలు తయారు చేసి గౌరమ్మకు సమర్పిస్తాం. ఆడబిడ్డల మంతా కలుసుకుంటాం. ప్రతి ఇంటా మహిళలు, ఆడబిడ్డల సందడి ఉంటుంది.
–అనుమోలు హైమావతి, డాబాలబజార్, ఖమ్మం
పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ. తంగేడు, గునుగు పూల కోసం అడవులకు వెళ్లి తీసుకు వస్తాం. చెరువుల నుంచి కలువ, తామర పూలను తెచ్చుకుంటాం. పూలను సేకరించటం ఆనందంగా ఉంటుంది. ప్రతింటికి వెళ్లి పూల చెట్లు ఉంటే అడగి మరీ కోసుకు వస్తాం. బతుకమ్మ పండుగ 9 రోజులు ఇంట్లో అంతా సందడే.
–సౌమ్య, ప్రకాష్‌నగర్, ఖమ్మం

ప్రకృతి ఆరాధన.. బతుకమ్మ

ప్రకృతి ఆరాధన.. బతుకమ్మ