
నోటరీల సమస్యలు పరిష్కరించండి
ఖమ్మంలీగల్: నోటరీ పబ్లిక్‌ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌కు నోటరీ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు శనివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా జిరాక్స్ సెంటర్ల వద్ద ‘నోటరీ చేయబడును’అనే బోర్డు పెట్టి నోటరీలు చేస్తుండడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరణించిన వారి స్టాంపులు ఉపయోగించడం, ఒకేసారి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేసివ్వడం వంటివి చేస్తున్నారని చెప్పారు. జిరాక్స్ సెంటర్లు, టైపిస్టుల నోటరీ దందా, నకిలీ నోటరీల గుర్తింపు వంటి వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. నోటరీ పబ్లిక్ సంఘం అధ్యక్షుడు పారుపల్లి అమర్‌చంద్, ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్‌చౌదరి, కోశాధికారి మందా రెడ్డెయ్య పాల్గొన్నారు.
సౌత్ జోన్ అథ్లెటిక్స్ మీట్‌కు జిల్లా క్రీడాకారులు
ఖమ్మంస్పోర్ట్స్: ఏపీలోని గుంటూరు నాగర్జున యూనివర్సిటీలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు జరుగున్న దక్షిణ భారత అథ్లెటిక్స్ మీట్‌లో జిల్లా నుంచి 10 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. వారిలో ఎ.గౌతమ్, ఎస్.గోపిచంద్, కె.అశోక్, డి.వివేక్‌చంద్ర, కె.మస్తాన్, ఎస్.కె.ముబీన్, ఎస్.కె.ఆఫ్రీన్, బి.వైశాలి, బి.బిందు, ఎ.మనుశ్రీ ఉన్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, అథ్లెటిక్స్ కోచ్ ఎండీ గౌస్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, ఎండీ షఫీక్‌అహ్మద్, ఉదయ్‌కుమార్ అభినందించారు.
పల్లె దవాఖాన పరిశీలన
కొణిజర్ల: మండలంలోని పల్లిపాడు గ్రామంలోని పల్లె దవాఖానను శనివారం డీఎంహెచ్‌ఓ కళావతిబాయి పరిశీలించారు. దవాఖాన నిర్మించి రెండేళ్లు గడుస్తున్నా నిరుపయోగంగా ఉండటంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించారు. రోడ్డు కంటే దిగువన ఉండటం, వాగు కావడం వల్ల నిత్యం నీరు పారుతోందని, ఆస్పత్రికి రోడ్డు సౌకర్యం లేక ఆస్పత్రి నిర్వహణ కుంటు పడిందని స్థానిక పీహెచ్‌సీ సిబ్బంది తెలిపారు. కలెక్టర్‌కు నివేదించి నిధుల కేటాయింపునకు కృషి చేస్తానని డీఎంహెచ్‌ఓ హామీ ఇచ్చారు. వైద్యాధికారి శారద పాల్గొన్నారు.