
పండుగ వేళ పస్తులేనా?
రెండు, మూడు రోజుల్లో జమ చేస్తాం
కుటుంబాల పోషణ ఎలా?
పెండింగ్ జీతాలు చెల్లించాలి
● వేతనాలు అందక చిరుద్యోగుల ఇక్కట్లు ● మల్టీపర్పస్ వర్కర్లు, ఆపరేటర్లకు ఎదురుచూపులే
ఎర్రుపాలెం: రెక్కాడితే కాని డొక్కాడని వేలాది మంది చిరుద్యోగులకు నెలలు తరబడి జీతాలు రావడం లేదు. చిరుద్యోగులు కావడంతో బయట అప్పు కూడా సక్రమంగా పుట్టడం లేదు. సకాలంలో జీతాలు అందక కుటుంబాలను ఎలా పోషించాలో దిక్కుతోచని స్థితిలో గ్రామపంచాయతీల మల్టీపర్పస్ వర్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఉద్యోగులకై తే ఠంచన్‌గా నెలవారీ జీతాలు ఇస్తూ తమను ఇబ్బందుల పాలుచేయడం సమంజసమా అని చిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
అన్ని పనుల్లోనూ కీలకం
తెల్లారితే చాలు గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులతో పాటు అన్ని రకాల పనులు చేస్తున్న పంచాయతీ వర్కర్ల బాగోగులను జిల్లా అధికార యంత్రాంగం, పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వర్కర్లతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ వర్కర్లు ఎదురుచూస్తున్నా పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో అల్లాడుతున్నారు. జిల్లాలో 2 వేల మంది మల్టీపర్పస్ వర్కర్లున్నారు. వారికి ప్రభుత్వం రూ.9500 జీతం ఇస్తోంది. అది కూడా ప్రతీ నెల ఇవ్వక కుటుంబాలు గడవని పరిస్థితి నెలకొంది.
కంప్యూటర్ ఆపరేటర్లదీ అదే పరిస్థితి
జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయాల్లో 76 మంది కంప్యూటర్ ఆపరేటర్లున్నారు. వీరికి నెలకు రూ.19,500 జీతం ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.22,750 ఇచ్చేవారు. అలాంటిది రూ.3 వేలు తగ్గించారు. జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించడం ఏ మేరకు సమంజసమని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవి కూడా మూడు నెలలుగా ఇవ్వడం లేదు. కంప్యూటర్ ఆపరేటర్లు మండల పరిషత్ కార్యాలయానికి, పంచాయతీలకు సంబంధించిన పలురకాల విధులు నిర్వహిస్తున్నారు.
పంచాయతీ వర్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు మూడు నెలలుగా జీతాలు పెండింగ్ ఉన్న మాట నిజమే. కొన్ని కారణాల వల్ల చెల్లింపులు జరగలేదు. మరో రెండు, మూడు రోజుల్లో వర్కర్లకే కాక ఆపరేటర్ల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తాం
–ఆశాలత, జిల్లా పంచాయతీ అధికారి
మూడు నెలలుగా జీతాలు లేకపోతే కుటుంబాలను ఎలా పోషించాలి. మాకొచ్చేదే తక్కువ జీతం కావడంతో అప్పు కూడా పుట్టడం లేదు. సకాలంలో జీతం చెల్లించాలని కోరినా ఫలితం లేదు. ఇకనైనా ప్రభుత్వం మా పరిస్థితి అర్థం చేసుకోవాలి.
–గంతాల నాగేశ్వరరావు,
మల్టీపర్పస్ వర్కర్, మామునూరు
మూడు నెలలుగా ఉన్న పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. గతంలో మాకు వచ్చే రూ.22,750 జీతంలో రూ.3,200 తగ్గించారు. గత పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం జీతాలు పెంచడమేకాక ప్రతీనెల క్రమంగా చెల్లించాలి.
–పారా జోజిరాణి,
కంప్యూటర్ ఆపరేటర్, ఎర్రుపాలెం

పండుగ వేళ పస్తులేనా?

పండుగ వేళ పస్తులేనా?

పండుగ వేళ పస్తులేనా?