
డంపింగ్ యార్డ్‌కు స్థలాన్ని గుర్తించండి
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్త డంపింగ్‌కు అవసరమైన స్థలాన్ని త్వరగా గుర్తించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లి, పల్లిపాడు, లాలాపురం తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను మంగళవారం పరిశీలించిన ఆమె మూడెకరాలకు తగ్గకుండా స్థలం ఎంపిక చేయాలని తెలిపారు. అయితే, తల్లాడ మండలం కొడవటిమెట్ట వద్ద ప్రభుత్వ స్థలాన్ని గతంలో కేటాయించినా దూరం కావడంతో చెత్త తరలింపుఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. దీంతో పల్లిపాడు – లాలాపురం సమీపాన 1.36 ఎకరాల ప్రభుత్వ స్థలం రికార్డులు అందజేయాలని కొణిజర్ల తహసీల్దార్ ఎన్.అరుణకు ఫోన్‌లో సూచించారు. తొలుత తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గంలోని తహసీల్దార్లతో అదనపు కలెక్టర్ శ్రీజ సమీక్షించారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ కే.వీ.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ యు.గురులింగం తదితరులు పాల్గొన్నారు.