
అండర్ పాస్ ఎత్తు పెంచాల్సిందే..
మధిర: గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలో భాగంగా నిర్మిస్తున్న అండర్ పాస్ ఎత్తు పెంచాలని మధిర మండలం నిధానపురం గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు పనులు జరుగుతున్న ప్రదేశం వద్ద సోమవారం నిరసన తెలిపారు. అండర్ పాస్‌ను 12అడుగులతో నిర్మిస్తుండడంతో ప్రజల రాకపోకలు, రైతులు పంట ఉత్పత్తుల వాహనాలు రావడం ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఈమేరకు 20 అడుగులకు పెంచకపోతే పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు.
విద్యుత్ విజిలెన్స్ అధికారుల తనిఖీ
మాజీ సర్పంచ్ ఇంటికి సరఫరా కట్
బోనకల్: బోనకల్ మండలం చొప్పకట్లపాలెంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఎర్రంశెట్టి సుబ్బారావు 2022 నుంచి విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో రూ.53వేల బకాయి పేరుకుపోగా సరఫరా నిలిపివేశారు. అలాగే, మరికొన్ని సర్వీసులను కూడా తనిఖీ చేశారు. ఏఈ మనోహర్, సీహెచ్.రమణి తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ విద్యార్థినికి
బంగారు పతకం
కారేపల్లి: మండలంలోని తొడితలగూడెంకు చెందిన ఆదివాసీ విద్యార్థిని ఎట్టి ప్రియ కు బంగారు పతకం లభించింది. మహా త్మాగాంధీ యూనివర్సిటీ నుంచి బీఈడీ పూర్తిచేసిన ఆమె యూనివర్సిటీ స్థాయి ఫలితా లు సాధించడంతో బంగారు పతకం ప్రకటించారు. ప్రియ తండ్రి రమణ ఆమె చిన్నతనంలోనే మృతిచెందగా, తల్లి కోటేశ్వరి కూలీ పనులకు వెళ్తూ చదివించింది. ఈ సందర్భంగా ప్రియను పలువురు అభినందించారు.
బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.16కోట్లు
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో తారురోడ్ల నిర్మాణానికి రూ.16.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి తెలిపా రు. మండలంలోని పెద్ద గోపవరం – బంజర, కొత్త గోపవరం – బంజర, జమలాపురం – రామాపురం మార్గంలో ఈ నిధులతో రహదారుల నిర్మానం జరుగుతుందని వెల్లడించారు.
‘జాలిముడి’ మరమ్మతులకు రూ.5.23 కోట్లు
ఖమ్మంఅర్బన్: మధిర మండలం జాలిముడి ఆనకట్ట కెనాల్ మరమ్మతుల కోసం రూ.5.23 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జాలిముడి ఆనకట్ట ఎడమ, కుడి ఫ్లాంక్ కెనాళ్ల మరమ్మతులకు ఈ నిధులు కేటాయించింది. అంచనాలు, డిజైన్ రూపకల్పన బాధ్యతను ఖమ్మం చీఫ్ ఇంజనీర్‌కు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా మార్కెట్ చైర్మన్ల ఫోరం ఏర్పాటు
గౌరవ అధ్యక్షుడిగా హన్మంతరావు
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం ఏర్పాటైంది. రాష్ట్ర ఫోరం తరహాలో ఉమ్మడి జిల్లా ఫోరంను ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 మార్కెట్లకు గాను తొమ్మిది మార్కెట్లకు పాలకవర్గాలు ఉన్నాయి. ఈ మేరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సమావేశమైన చైర్మన్లు ఫోరం ఏర్పాటు చేసుకున్నారు. ఫోరం గౌరవ అధ్యక్షుడిగా ఖమ్మం ఏఎంసీ చైర్మన్ యరగర్ల హన్మంతరావును ఎన్నికయ్యా రు. అలాగే, అధ్యక్షుడిగా బండారు నరసింహారావు(మధిర), ఉపాధక్షులుగా బాగం నీరజ(కల్లూరు), కార్యదర్శిగా దోమ ఆనంద్‌బా బు(సత్తుపల్లి), సహాయ కార్యదర్శిగా టి. సీతమ్మ(భద్రాచలం),, కోశాధికారిగా ఇరుప శ్రీని వాసరావు(చర్ల)ను ఎన్నుకున్నారు. త్వరలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విధులు నిర్వర్తిస్తామని హన్మంతరావు తెలిపారు.

అండర్ పాస్ ఎత్తు పెంచాల్సిందే..

అండర్ పాస్ ఎత్తు పెంచాల్సిందే..