
మిర్చి ధర పతనం
● విదేశాలకు ఆర్డర్లు లేకపోవడమే కారణం? ● దేశీయంగా పండుగ ప్రభావం
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర తిరోగమనంలో కొనసాగుతోంది. జూలై ఆరంభం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన మిర్చి ధర ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. ప్రధానంగా విదేశాలకు ఎగుమతి చేసే ‘తేజా’ రకం మిర్చి ధరపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఓ వైపు విదేశీ ఆర్డర్లు లేకపోవటం, మరో వైపు దేశీయంగా దసరా పండుగ ప్రభావంతో కొనుగోళ్లు లేక ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అన్ సీజన్‌లో ధర వస్తుందనే ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన రైతులు వానాకాలం పంటల సాగు పెట్టుబడి కోసం అమ్మకానికి తీసుకొ స్తున్నారు. కానీ వారి ఆశలకు భిన్నంగా ధర పడిపోతుండడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది.
కొంత పెరిగినా...
సుమారు 50రోజులుగా మిర్చి ధరలో కొంత పురోగతి కనిపించింది. కానీ ఇప్పుడు తిరోగమనం దిశగా సాగుతుండడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. జూన్‌లో క్వింటా మిర్చి ధర రూ.13 వేల నుంచి రూ.13,500 పలకగా.. జూలైలో రూ. 13,900 వరకు పెరిగింది. ఆగస్టు ఆరంభంలో రూ. 14వేలకు పెరిగి, 26వ తేదీ నాటికి రూ.15,600కు చేరింది. ఇక ఈనెలారంభం నుంచి మాత్రం తిరోగమనం ప్రారంభమైంది. ఈనెల 1న రూ.15,450, 8న రూ.15,400, 10న రూ.15,200, 11న రూ.15,100గా, 12వ తేదీన రూ.15వేలకు తగ్గి సోమవారం రూ.14,900కు చేరింది. దీంతో నెల వ్యవధిలో క్వింటాకు రూ.700 ధర తగ్గినట్లయింది.
రకరకాల కారణాలతో..
తేజా రకం మిర్చిని చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. కానీ ఈ ఏడాది పంట సీజన్ నుంచి ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేక ధరలో పురోగతి కానరాలేదు. గత ఏడాది రూ.20వేలు పలికిన ఈ ఏడాది ఓ సమయాన సగానికి పడిపోయింది. సీజన్‌లో సగటున రూ.13 వేలు, చివరలో రూ.10వేలకు తగ్గింది. ఇప్పుడు అన్ సీజన్‌లో ధరలు లేకపోవడం గమనార్హం. విదేశాలకు ఆర్డర్లు లేకపోవడం ఓ కారణమైతే... ఉత్తరాది రాష్ట్రాల్లో దసరా పండుగ సీజన్ మొదలుకావడంతో కొనుగోళ్లు మందగించి ధరపై ప్రభావం పడుతున్నట్లు సమాచారం. అయితే, రైతులు మాత్రం వానాకాలం పంటల సాగు పెట్టుబడుల కోసం నిల్వ మిర్చి విక్రయానికి మొగ్గు చూపుతున్నారు. తద్వారా విక్రయాలు పెరగడం కూడా ధర పతనానికి కారణంగా ఇంకొకొందరు విశ్లేషిస్తున్నారు.