
అప్పుల బాధతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
తల్లాడ: మండలంలోని నరసింహారావుపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అప్పులు పెరగడం, అవి ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎదురవుతుండడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. నరసింహరావుపేటకు చెందిన పిన్ని ప్రశాంత్(27) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. ఆయన రూ.26 లక్షల మేర హైదరాబాద్‌కు చెందిన రిషిక మల్లికార్జున్, సురేష్‌కుమార్, రంజిత్‌కుమార్ వద్ద అప్పు చేయగా, తీర్చాలని వారి నుంచి ఒత్తిడి ఎదురైంది. దీంతో ఈనెల 12 రాత్రి స్వగ్రామానికి వచ్చిన ప్రశాంత్ 13వ తేదీన పురుగుల మందు తాగగా ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రశాంత్ ఆదివారం మృతి చెందడంతో ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పాఠశాలలో పాము కలకలం
వైరారూరల్: వైరా మండలం జింకలగూడెం ప్రాథమిక పాఠశాలలో సోమవారం పాము కలకలం రేపింది. సాయంత్రం తరగతులు ముగిశాక విద్యార్థులు ఆట వస్తువుల వద్దకు వెళ్లగా అక్కడ పాము కనిపించింది. దీంతో విద్యార్థులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈమేరకు స్థానికులు చేరుకుని పామును చంపేశారు. పాఠశాల చుట్టూ పిచ్చిమొక్కలు పెరగడంతో పాములు చేరాయని తెలుస్తుండగా, శుభ్రం చేయిస్తామని ఉపాధ్యాయుడు బి.పుల్లారావు తెలిపారు.
కారు బోల్తా, నలుగురికి గాయాలు
ముదిగొండ: ఖమ్మం–కోదాడ నేషనల్ హైవేపై ముదిగొండ మండలం వెంకటాపురం సమీపాన ప్రమాదవశాత్తు సోమవారం బోల్తా పడింది. ఖమ్మం నుంచి నాగమ్మ, నరేందర్, బాలకృష్ట, శేఖర్ కారులో కోదాడ వైపు వెళ్తుండగా టైరు పంక్చర్ కావటంతో బోల్తా పడగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సకోసం అంబులెన్స్‌లో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.