
జిల్లా అంతటా వర్షం
● కల్లూరు అత్యధికంగా 70 మి.మీ. వర్షపాతం ● పలుచోట్ల ఉధృత ంగా వాగులు
ఖమ్మంవ్యవసాయం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా శనివారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం 3గంటల తర్వాత వర్షం ప్రారంభమైంది. పలుచోట్ల దాదాపు రెండు గంటల పాటు వర్షం కురిసింది. అత్యధికంగా కల్లూరు మండల కేంద్రంలో 70.3 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, తిమ్మారావుపేటలో 68.5, మధిరలో 60.8, గంగారంలో 52.8, వేంసూరులో 49, ఎర్రుపాలెంలో 48.8, ముదిగొండలో 45, మధిర ఏఆర్‌ఎస్‌లో 42.8, పెద్ద గోపతిలో 41.5, పెనుబల్లిలో 38.3, ఏన్కూరులో 35.8 గేటు కారేపల్లిలో 33.5, గౌరారంలో 32, సత్తుపల్లి ఓసీ వద్ద 30.5, ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో 29.3, చింతకానిలో 29, సత్తుపల్లి, సదాశివునిపాలెంలో 25, పంగిడిలో 21, ఖమ్మం ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్ వద్ద 20.3 మి.మీల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన వర్షాలతో వరద వాగుల్లోకి చేరి ఉధృతంగా ప్రవహించాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వర్షాలు పంటలకు ప్రయోజనం కలిగిస్తాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరదలో చిక్కుకున్న కూలీలు క్షేమం
ఏన్కూరు: ఏన్కూరు మండలం కేసుపల్లి పరిధిలో కొందరు కూలీలు శనివారం వరదలో చిక్కుకున్నారు. పొలాల్లో పని ముగించుకొని సాయంత్రం వస్తుండగా ఏలుగోడు వాగు ప్రవహాంతో చిక్కుకపోయారు. గ్రామస్తులు తాళ్ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కాసేపటికి వరద తగ్గడంతో కూలీలు వాగు దాటి క్షేమంగా గ్రామానికి చేరారు.