
ఆదిలోనే హంసపాదు
దిగుబడి తగ్గినట్లే...
30 ఎకరాల్లో సాగు చేశా...
● వేంసూరు మండలంలో ‘2782’ వరి రకం సాగు ● 90 రోజులకే 40శాతం మేర ఈనిన పంట ● ఫలితంగా దిగుబడిపై రైతుల్లో ఆందోళన
వేంసూరు: రాష్ట్రప్రభుత్వం సన్న రకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుండడంతో రైతులు ఈసారి ఎక్కువగా సన్నరకాల సాగుకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే, కల్తీ విత్తనాలా, ఇంకేదైనా కారణమో తెలియదు కానీ వేంసూరు మండలంలో పలువురు సాగు చేసిన వరి ముందుగానే ఈనింది. దీంతో మిగతా పంట ఈనేలోగా మొదటి గింజలు రాలిపోతే దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు.
దిగుబడి వస్తుందని...
వేంసూరు మండల వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో 28 వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇందులో 27 వేల ఎకరాలు సన్న రకాలే ఉన్నాయి. మండలంలోని కందుకూరు, భరణిపాడు, మర్లపాడు, చౌడవరం, కుంచపర్తి గ్రామాల రైతులు పంట కాలం ఎక్కువైనా దిగుబడి బాగుంటుందనే భావనతో కరీంనగర్ వరణ్ అగ్రిటెక్‌కు చెందిన బీపీటీ 2782 రకం విత్తనాలు ఎంచుకున్నారు. మండలంలో దాదాపు 3వేల ఎకరాలల్లో ఈ రకాన్ని సాగు చేయగా 150 రోజుల పంట కాలం కలిగిన ఈ రకం 120 రోజుల తర్వాత ఈతకు రావాలి. కానీ 90 రోజులకే 40శాతం మేర పంట ఈనుతుండడంతో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు సత్తుపల్లి మండలం నారాయణపురం, కందుకూరు డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. దాదాపు బీపీటీ 2782 వరి రకం మొత్తం ముందుగానే ఈనుతుండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఎదుర్కొంటున్నారు.
దిగుబడిపై ప్రభవం
వరి సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టారు. అయితే, 2782 రకం వరి 120రోజులకు ఈతకు రావాల్సి ఉండగా వరి 90రోజులకే 40శాతం ఈనుతుండడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మరో 30రోజుల తర్వాత మిగతా వరి ఈనేలోగా ముందుగా ఈనిన వరి గింజలు రాలిపోతే దిగుబడి తగ్గే అవకాశముందని చెబుతున్నారు. మొత్తంగా ఎకరాకు 20బస్తాల దిగుబడి తగ్గనుండడంతో పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు విత్తన కంపెనీ యాజమాన్యం, అధికారులు వరి పంటను పరిశీలించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
20ఎకరాల్లో బీపీటీ 2782 రకం సాగు చేశా. పంటకాలం కంటే ముందే వరి ఈనడంతో దిగుబడి సగానికి పైగా తగ్గుతుంది. ఎకరాకు 50 బస్తాల దిగుబడి వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున కంపెనీ యాజమాన్యమే న్యాయం చేయాలి.
– ఒగ్గు సత్యనారాయణరెడ్డి, రైతు, కందుకూరు
ఎకరాకు రూ.30వేల చొప్పున పెట్టుబడితో 30ఎకరాల్లో బీపీటీ 2782 రకం సాగు చేశా. ముందుగానే సగం పొలం ఈనుతోంది. వెనుక పంట ఈతకు వచ్చేలోగా ముందు పంట రాలిపోతుంది. దీంతో పెట్టుబడి కూడా వస్తుందో, రాదో తెలియడం లేదు.
– గొర్ల రాజశేఖర్‌రెడ్డి, రైతు, కందుకూరు

ఆదిలోనే హంసపాదు

ఆదిలోనే హంసపాదు

ఆదిలోనే హంసపాదు