
21న ఖమ్మం మార్కెట్‌కు సెలవు
ఖమ్మంవ్యవసాయం: ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా సోమవారం(21న) ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. తిరిగి మంగళవారం యధాతథంగా పంటల కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.
బ్రిడ్జి నిర్మించాలని
రైతుల ఆందోళన
చింతకాని: మండలంలోని బస్వాపురంలో దేవరపల్లి–సూర్యాపేట జాతీయ రహదారి వద్ద శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. హైవే నిర్మాణంతో ఎన్నెస్పీ చింతకాని మేజర్‌పై ఉన్న రహదారి మూసుకుపోగా, కాల్వపై బ్రిడ్జి నిర్మించడం లేదని ఆరోపించారు. రైతులు ఇబ్బందుల దృష్ట్యా కాల్వలకు నీటి విడుదల కాకముందే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులు కన్నెబోయిన గోపి, బొడ్డు వెంకట రామారావు, ముప్పారపు సైదులు, బొడ్డు సంజీవరావు, కన్నెబోయిన పాండురంగారావు, బొడ్డు శ్రీనివాసరావు, దాసరి శ్రీనివాసరావు, పోల్నీడు రవీంద్రబాబు, బొంతు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌పై కాంగ్రెస్
నాయకుల ఫిర్యాదు
రఘునాథపాలెం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అసభ్య పదజాలంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూషించినందున, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని కే.వీ.బంజరకు చెందిన కాంగ్రెస్ మాలోతు రాము, రామ్మూర్తి, నాయకులు శుక్రవారం రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్‌కు ఫిర్యాదు అందజేశారు.
యూరియా కోసం
రైతుల తిప్పలు
బోనకల్: మండలంలోని రావినూతల పీఏసీఎస్ వద్ద శుక్రవారం రైతులు యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. సహకార సంఘానికి 25 మెట్రిక్ టన్నుల యూరియా రావడం.. గురువారం రాత్రి వర్షం కురిసిన నేపథ్యాన పత్తి చేన్లలో చల్లేందుకు యూరియా కోసం రైతులు చేరుకున్నారు. పలువురు సీఈఓ కార్యాలయంలోకి దూసుకెళ్లి వాదనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఏఓ పసులూరి వినయ్‌కుమార్ వచ్చి రైతులతో మాట్లాడారు. యూరియాతో పాటు నానో యూరియా కూడా అందుబాటులో ఉన్నందున ఎవరూ ఆందోళన చెందొదద్దని సర్దిచెప్పారు.
కేటీఆర్ పర్యటనలో సీఐ!
ఖమ్మంక్రైం: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన కోసం హెలీకాప్టర్‌లో రాగా, హెలీప్యాడ్ వద్ద ఓ సీఐ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పదుడిగా ముద్ర పడిన ఆ సీఐ భద్రాద్రి జిల్లా డీసీఆర్‌బీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి సివిల్ డ్రస్‌లో హెలీప్యాడ్ వద్ద వేచి ఉండడాన్ని గుర్తించారు. గతంలో ఖమ్మం రూరల్ సీఐగా విధులు నిర్వర్తించినప్పుడు ఆయన బీఆర్‌ఎస్ నాయకుల సూచనలతో ఇతర పార్టీల నేతలను వేధించాడనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు గతంలో ఘాటుగా స్పందించారు. ఇప్పుడు ఆయన కేటీఆర్ పర్యటనలో పాల్గొనడం పోలీసు వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఉన్నతాధికారుల అనుమతితో వచ్చాడా, లేదా అన్నది తెలియరాలేదు. అయితే, గతంలో సిరిసిల్లలో పనిచేసినప్పుడు కేటీఆర్‌తో ఉన్న సంబంధాల కారణంగానే వచ్చి ఉంటాడని మరికొందరు చెబుతున్నారు.
కన్సాలిడేటెడ్ లెక్చరర్ తొలగింపు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఖమ్మంలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో కన్సాల్డిడేటెడ్ లెక్చరర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావును టర్మినేషన్(ఉద్యోగంలో నుంచి తొలగింపు) చేస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఈనెల 1న జారీ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులతో శ్రీనివాసరావు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఈ ఏడాది జనవరిలో విచారణ కమిటీని నియమించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్ వరలక్ష్మి చైర్మన్‌గానే కాక మరికొందరు సభ్యులతో నియమించిన కమిటీ విచారణ పూర్తిచేసిన నివేదికను అధికారులకు అందజేసింది. దీంతో కన్సాలిడేటెడ్ లెక్చరర్ శ్రీనివాసరావుకు రిజిస్ట్రార్ రామచంద్రం షోకాజ్ నోటీస్ జారీచేశారు. ఆ నోటీసుకు అందిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో శ్రీనివాసరావును విధుల నుంచి టర్మినేషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ శుక్రవారం ‘సాక్షి’తో ధ్రువీకరించారు.

21న ఖమ్మం మార్కెట్‌కు సెలవు