
ఆర్ అండ్ బీ ఈఈగా పవార్
ఖమ్మం అర్బన్: ఖమ్మం ఆర్ అండ్ బీ ఈఈగా ఎం.పవార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈఈగా హైవే విభాగానికి చెందిన యుగంధర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమేరకు హైదరాబాద్ నుంచి పవార్‌ను బదిలీ చేయగా విధుల్లో చేరిన ఆయనకు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.
బ్లడ్‌బ్యాంక్‌ల్లో నిబంధనలు విస్మరించొద్దు
ఖమ్మంవైద్యవిభాగం: బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు నిబంధనలు పాటిచాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశించారు. శాఖ ఉద్యోగులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సంయుక్తంగా ఖమ్మంలోని పలు బ్లడ్ బ్యాంక్‌ల్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, సిబ్బంది అర్హతలు, రక్తం నిల్వలను పరిశీలించాక నిర్వాహకులకు సూచనలు చేశారు. అయితే, విధుర బ్లడ్ బ్యాంకులో తనిఖీ సందర్భంగా రక్తపు నిల్వలు ఇంకో చోట ఉన్నట్లు గమనించి స్టాక్‌ను పరిశీలించారు. అలాగే, శాంపిల్స్‌ను ఐపీఎం ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అసిస్టెంట్ డ్రగ్ కంట్రోల్ అధికారి అరవింద్, జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్‌రెడ్డి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు అనిల్‌కుమార్, అశ్విని, డిప్యూటీ డీఎంఎచ్‌ఓ సైదులు, బ్లడ్ బ్యాంకు ప్రోగ్రాం అధికారి వెంకటరమణ, డిప్యూటీ డెమో జి.సాంబశివరెడ్డి పాల్గొన్నారు.
సౌర విద్యుత్ ఉత్పత్తిపై ఇంజనీర్లకు శిక్షణ
ఖమ్మంవ్యవసాయం: గృహాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యాన ఎన్పీడీసీఎల్ ఇంజనీర్లకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని ఇంజనీర్లకు ఖమ్మంలో సోమవారం శిక్షణ మొదలుకాగా, ఇళ్లపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ తదితర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ప్రధానమంతి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకంలో భాగంగా ప్లాంట్లు ఏర్పాటుచేయనుండగా ప్రజలకు అవగాహన కల్పించేలా ఈ శిక్షణ ఇస్తున్నట్లు ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈలు బాబూరావు, రామారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.