
దరఖాస్తులు పెండింగ్ ఉండొద్దు
‘గ్రీవెన్స్ డే’లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కారం చూపాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి(గ్రీవెన్స్‌డే)లో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డితో కలిసిఆయన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ప్రజావాణిని అధికారులు అత్యంత ప్రాధాన్యతగా భావించి హాజరుకావాలని సూచించా రు. ప్రతీ దరఖాస్తును పరిశీలించి నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని, ఏదైనా పరిష్కరించలేకపోతే అందుకు కారణాలను దరఖాస్తుదారులకు తెలపాలని చెప్పారు. అయితే, దరఖాస్తుల పరిష్కారంలో మానవీయకోణంతో పనిచేయాలని తెలిపారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్య పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులకు సన్మానం
వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ సోమవారం ఉద్యోగ విరమణ చేసిన 22మంది అధికారులు, ఉద్యోగులను కలెక్టర్ అనుదీప్ సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడిన కలెక్టర్.. విధినిర్వహణలో అనుభవాలను ప్రస్తుత ఉద్యోగులతో పంచుకోవాలని సూచించారు. కాగా, చైన్‌మెన్‌గా విధుల్లో చేరి చింతకాని తహసీల్దార్‌గా రిటైర్డ్ అవుతున్న కె.అనంతరాజు, డీటీ సీహెచ్.సత్యనారాయణ తదితరులు తమ అనుభవాలను వివరించారు.