
గోదావరి పుష్కరాలకు ప్రణాళికే కీలకం
● 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాలు ● కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా ● ఇంకా ప్రణాళిక, నిధులు విడుదల చేయని ప్రభుత్వం
భద్రాచలం: భక్తులు మహా పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు రెండేళ్ల సమయమే ఉంది. 2027లో జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించగా భ ద్రాచలానికి కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద నున్న త్రయంబకంలో పుట్టిన గోదావరి నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలో ప్రవేశిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల మీదుగా భద్రాద్రి జిల్లాలోకి ప్రవేశించి భద్రాచలం దిగువన ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ద్వారా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నది 180 కి.మీ.ప్రవహించగా, విభజనం అనంతరం ఏపీలో ఏడు మండలాలు విలీనం కాగా, ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో 70 కి.మీ.ప్రవహిస్తోంది.
2015లో పుష్కరాలు..
గత పుష్కరాలు 2015 జూలై 14 నుంచి 25 వరకు జరిగాయి. మళ్లీ 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నారు. బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, పర్ణశాల, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు పుష్కర స్నానం చేయనున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి అత్యధికంగా తరలివస్తుంటారు. గత పుష్కరాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 70 లక్షల మంది భక్తులు హాజరయ్యారని, 2027లో కోటి మందికి పైగానే భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం, పర్ణశాల, మోతె తదితర ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
ప్రణాళిక ప్రకటించని ప్రభుత్వం
2027లో పుష్కరాలను విజయవంతం చేయాలంటే కనీసం రెండేళ్ల ముందు నుంచే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. స్నానఘాట్ల పెంపు, రోడ్లు వెడల్పు, ఆలయ పరిసర ప్రాంతాల విస్తరణ, భక్తులకు వసతుల కల్పన వంటి పనులు చేపట్టాలి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ముందస్తు పనులకు రూ.50కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఘాట్ల పెంపు వంటి వసతుల కల్ప నకు, శాశ్వత పనులకు ఇంకా నిధులు అవసరమవుతాయి. ఏపీలో ఇప్పటికే ఈ పుష్కరాల పనులపై సమీక్ష, బడ్జెట్‌తో ప్రణాళిక ప్రకటించారు. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఏ ప్రకటనా వెలువడలేదు. దీనిపై ఉమ్మడి జిలా మంత్రులు చొరవ తీసుకుని ప్రణాళిక, నిధులు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.