
నేటి నుంచి గురుపౌర్ణమి వేడుకలు
సాయి మందిరాల్లో 11 రోజుల పాటు
అభిషేకాలు, హోమాలు
ఖమ్మంగాంధీచౌక్: గురుపౌర్ణమి వేడుకలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సాయిబాబా మందిరాల్లో 11రోజుల పాటు అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వర కు ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. వేడుకల్లో భాగంగా గురువులను, పెద్దలను పూజించే రోజును గురుపూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. వేద వ్యాసుడిని మానవులంతా గురువుగా భావిస్తారు. గురుపౌర్ణమి రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. మరి కొందరు సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఆచరిస్తారు. ఈ వేడుకల కోసం ఖమ్మం నగరంలోని రంగనాయకుల గుట్ట పక్కన గల శ్రీకృష్ణసాయి ఆశ్రమం, గాంధీచౌక్‌లోని షిర్డీసాయి మందిరంతో పాటు జిల్లాలోని పలు సాయిబాబా ఆలయాలు, మందిరాల్లో ఏర్పాట్లు చేశారు.
విద్యారంగ పరిరక్షణకు
కృషి చేయాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్
ఖమ్మం సహకారనగర్ : విద్యారంగ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.అనిల్‌కుమార్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 20శాతం నిధులు కేటాయించాలని కోరారు. ఖమ్మంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీల తర్వాతే పదోన్నతులు చేపట్టాలన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించి ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీపీటీఎఫ్ నేతలు నాగిరెడ్డి, మనోహర్ రాజు, విజయ్, పద్మ మాట్లాడుతూ.. కేజీబీవీ ఉద్యోగులకు మొదటి తారీఖునే వేతనాలు చెల్లించాలని, వారిని రెగ్యులర్ చేయాలని కోరా రు. కేజీబీవీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.వి. నాగేశ్వరరావు, వెంగళరావు, నాయకులు రమాదేవి, ముత్తయ్య, వెంకటేశ్వరరావు, వీరబాబు పాల్గొన్నారు.
అమ్మవారికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్ ద్వారా భక్తులు దర్శించుకుని అమ్మవారికి ఒడిబియ్యం, తలనీలాలు, చీరలు, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించగా, భక్తులు బోనాలు, సారె సమర్పించారు. ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయకమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

నేటి నుంచి గురుపౌర్ణమి వేడుకలు