
సోషలిజం కోసం సీఐటీయూ పోరాటం
ఖమ్మంఅర్బన్: దేశంలో ఆర్థిక అసమానతలు లేని సమసమాజం, సోషలిజం స్థాపనే సీఐటీయూ లక్ష్యమని, కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పెట్టుబడిదారుల పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు పేర్కొన్నారు. శనివారం యర్రా శ్రీకాంత్‌నగర్ సత్తెనపల్లి రామకృష్ణభవన్‌లో నిర్వహించిన సీఐటీయూ ఖానాపురం హవేలీ మండల మహాసభలో తొలుత సంఘం జెండా ఆవిష్కరించాక ఎం.సాయిబాబ మాట్లాడారు. దేశ సంపదను సృష్టించేది కార్మిక వర్గమే అయినా, దానిని కొద్దిమంది పెట్టుబడిదారులు కబ్జా చేస్తున్నారని, కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా కేంద్రం తీసుకొచ్చిందని, ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు తుమ్మ విష్ణువర్దన్, కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జూలై 9న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. మహాసభలో మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పిన్నింటి రమ్యతోపాటు ఎం.తిరుమలాచార్యులు, వై.విక్రమ్, దొంగల తిరుపతిరావు, భూక్య శ్రీనివాస్, గాలి వెంకటాద్రి, గొర్రెముచ్చు నాగేశ్వరరావు, గాలి అంజయ్య, కర్ల వీరస్వామి, వేదగిరి మురహరి, మాచర్ల గోపాల్, నల్లమల సత్యనారాయణ, కుర్రి వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖానాపురం హవేలీ మండల సీఐటీయూ కన్వీనర్‌గా గాలి అంజయ్య, కోకన్వీనర్‌గా కర్ల వీరస్వామితోపాటు సభ్యులను ఎన్నుకున్నారు.