
మాకు న్యాయం చేయండి..
కారేపల్లి: ‘నా భర్త వేరే మహిళతో సహజీవనం చేస్తూ నన్ను, నా కుమారుడిని ఇంట్లో నుంచి గెంటేశాడు. నాకు, నా కుమారుడికి న్యాయం చేయండి’అని ఓ వివాహిత ప్రాధేయపడింది. బాధితురాలు శనివారం విలేకరులతో తెలిపిన వివరాలు.. మాధారం గ్రామానికి చెందిన శైలజ, అదే గ్రామానికి చెందిన ఏనుగు శివయ్య 16 ఏళ్ల కిందట ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, శివయ్య వేరే మహిళతో సహజీవనం చేస్తూ, శైలజను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ఈ ఘటనపై శైలజ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శివయ్యను మందలించి వదిలేశారు. అయినా తీరుమార్చుకోని శివయ్య అదే మహిళతో ఉంటూ తమను వదిలించుకోవడం కోసం చిత్ర హింసలు పెడుతున్నాడని శైలజ కన్నీటి పర్యంతమైంది. శివయ్య తన పేరుతో ఉన్న రెండు ఎకరాల భూమిని విక్రయించి, తనకు, తన కుమారుడికి అన్యాయం చేయాలని చూస్తున్నాడని, స్థానిక తహసీల్దార్, కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొంది. మాధారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తన ప్రోద్బలంతో మంత్రుల పేర్లు చెప్పి తన భర్తను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకు పోయాడని, తనకు, తన కుమారుడికి న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.