
‘నివేదన’.. పరిశీలన
● డీడీఎన్ పథకానికి ఉమ్మడి జిల్లాలో 205 దరఖాస్తులు ● ఈఓలు, అర్చకులతో విచారణ కమిటీల ఏర్పాటు ● నివేదికల ఆధారంగా ఆలయాల ఎంపిక
ఖమంగాంధీచౌక్: ధూప దీప నివేదన(డీడీఎన్) పథకానికి దరఖాస్తు చేసుకున్న ఆలయాల పరిశీలన ప్రక్రియను దేవాదాయ, ధర్మాదాయ శాఖ చేపట్టింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మే 1న నోటిఫికేషన్ విడుదల చేసి, అదే నెల 24వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. దీంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి 205 దరఖాస్తులు అందగా.. వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పరిశీలనకు ఆలయాల ఈఓలు, అర్చకులతో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్.. కమిటీలు ఏర్పాటు చేసి, పరిశీలన బాధ్యతలు అప్పగించారు. డీడీఎన్ నిబంధనల ఆధారంగా నియోజకవర్గాల వారీగా ఆలయాలను పరిశీలించి సమగ్ర నివేదికలు అందించాలని సూచించారు.
ఆలయాల మనుగడ కోసం..
పురాతన ఆలయాలు మనుగడ కోల్పోతుండగా వాటి పునర్ వైభవం కోసం 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధూప దీప నివేదన పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 450 ఆలయాలకు ఈ పథకం అమలువుతోంది. ఇటీవల ప్రభుత్వం విడుదల నోటిఫికేషన్ ఆధారంగా ఖమ్మం జిల్లా నుంచి 146, భద్రాద్రి జిల్లా నుంచి 59 ఆలయాల అర్చకులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని దేవాదాయ, ధర్మాదాయ శాఖ నియమించిన కమిటీ పరిశీలించాక అర్హత గల ఆలయాలకు పథకం అమలయ్యే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లాలో ఆరు కమిటీలు..
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు.. ఎండోమెంట్ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న ముఖ్య కార్యనిర్వహణాధికారులు, అర్చకులతో ధూప దీప నివేదన దరఖాస్తుల పరిశీలనకు కమిటీలు నియమించారు. ఖమ్మం జిల్లాలో మూడు, భద్రాద్రి జిల్లాలో మూడు కమిటీలకు ఈ బాధ్యతలు అప్పగించారు. డీడీఎన్ పథకానికి ప్రభుత్వం పలు నిబంధనలను రూపొందించింది. ముఖ్యంగా పురాతన ఆలయాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆలయం నిర్మించి 15 ఏళ్లు నిండి ఉండాలని, దేవాదాయ శాఖలో రిజిస్ట్రేషన్ చేసి ఉండాలని, ఆలయానికి మెట్ట భూమి ఐదెకరాలు, మాగాణి భూమి 2.50 ఎకరాలకు మించి ఉండరాదని, ఆలయంలో నిత్యం అర్చకుడు దీపం వెలిగించి నివేదన చేస్తూ ఉండాలని నిబంధనల్లో పొందుపర్చారు.
నివేదిక ఆధారంగా ఎంపిక..
డీడీఎన్ పథకం దరఖాస్తుల పరిశీలనకు ఎంపిక చేసిన కమిటీలు క్షేత్ర స్థాయిలో ఆలయాలను సందర్శించి, ఆలయ చరిత్ర, ఆస్తి తదితర అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అర్చకుడి పనితీరును కూడా పరిశీలించాలి. నిబంధనల ఆధారంగా దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించి ఆలయాల వారీగా నివేదికలను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు అందించాక ఆయన విచారణ చేసి తుది నిర్ణయం, అనుమతులను ఉన్నతాధికారులకు పంపిస్తారు. ఆ తర్వాత ఎంపికై న ఆలయాల జాబితా విడుదలవుతుంది. అర్హత సాధించిన ఆలయాలకు ప్రభుత్వం నెలకు రూ.10 వేలు అందిస్తుంది. వీటిలో రూ.6 వేలు పడితరం(ఆలయ నిర్వహణ), రూ. 4 వేలు అర్చకుడికి గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
నిబంధనల మేరకు ఎంపిక చేస్తాం
నిబంధనలకు లోబడి ధూప దీప నివేదన పథకానికి ఆలయాలను ఎంపిక చేస్తాం. పరిశీలన కమిటీలు క్షేత్ర స్థాయిలో ఆలయాలను సందర్శిస్తాయి. ఈ ప్రక్రియలో దరఖాస్తుదారులు ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దు. అర్హతల ఆధారంగా ఆలయాల ఎంపిక ఉంటుంది. తుది నిర్ణయం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ తీసుకుంటుంది.
– ఎం వీరస్వామి, దేవాదాయ శాఖ ఏసీ

‘నివేదన’.. పరిశీలన