
సాధారణ ప్రసవాలు పెంచాలి
● ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచండి ● ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండాలి.. ● అధికారులకు కలెక్టర్ అనుదీప్ ఆదేశం
సత్తుపల్లి : ప్రభుత్వాస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిని శనివారం ఆయన సందర్శించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చే వారితో సేవాభావంతో మెలగాలని, సమయపాలన పాటిస్తూ మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. వైద్య సిబ్బంది సరిపడా ఉన్నారా అని సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.34 కోట్లతో నిర్మించిన నూతన ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను తనిఖీ చేసి వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
ఈ – పాస్‌తోనే ఎరువులు విక్రయించాలి..
రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. స్థానిక అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసి, పురుగుమందులు, ఎరువులు, విత్తనాల వివరాలపై ఆరా తీశారు. ఈ–పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని చెప్పారు. అధిక లాభాలు వచ్చే ఉద్యాన పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు మట్టి, ఇసుక ఇబ్బందులు వస్తున్నాయని కొత్తూరు గ్రామ లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తేగా మట్టి, ఇసుక ముందుగానే డంప్ చేసి తహసీల్దార్ కూపన్ల ద్వారా జారీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కల్లూరు ఆర్డీఓ ఎల్.రాజేంద్రగౌడ్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాజశేఖర్, పబ్లిక్‌హెల్త్ ఈఈ ఉమామహేశ్వరరావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ టి.సీతారాం, తహసీల్దార్ సత్యనారాయణ, కమిషనర్ కె.నర్సింహా, వైద్యులు సురేష్ నారాయణ, వసుమతీదేవి పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి..
పెనుబల్లి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. పెనుబల్లి మండలం రామచందర్‌రావు బంజర్‌లో నిర్మాణ పనుల ను శనివారం ఆయన పరిశీలించారు. ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇళ్లకు అవసరమైన ఇసుక, మట్టి లబ్ధిదారులకు ఉచితంగా అందేలా చూడాలని ఆర్డీఓ రాజేందర్ గౌడ్‌ను ఆదేశించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని అన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ కమల్‌పాషా, ఎంపీడీఓ అన్నపూర్ణ, ఆర్‌ఐ జగదీష్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలి
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యవసాయ రంగాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల పనితీరుపై శనివారం ఆయన సమీక్షించారు. ఎరువులు, విత్తనాల లభ్యత, రైతు భరోసా, రైతు బీమా, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం వంటి అంశాలపై మండలాల వారీగా చర్చించి సూచనలు చేశారు. ఆధునిక సాగు పద్ధతులు, పంటల మార్పిడి విధానంలో జిల్లా ముందంజలో ఉండాలని సూచించారు. విత్తనాలు నాణ్యంగా ఉండేలా చూడాలని, ఎక్కడా కల్తీ విత్తనాలు అమ్మకుండా చూడాలని అన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. వరి వైపు మాత్రమే రైతులు మొగ్గు చూపకుండా లాభసాటి పంటలపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పొలాల మధ్యలో ఫిష్ పాండ్ అభివృద్ధితో లాభాల గురించి వివరించాలన్నారు. సమావేశంలో డీఏఓ ధనసరి పుల్లయ్య, ఇన్‌చార్జ్ ఉద్యానాధికారి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.