
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
● వినియోగదారులకు త్వరలో అవగాహన సదస్సులు ● ఎస్‌ఈ శ్రీనివాసాచారి వెల్లడి
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సమస్యను తమ దృష్టికి తీసుకొస్తే ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని ఎన్పీడీసీఎల్ ఖమ్మం సర్కిల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసా చారి తెలిపారు. జిల్లాలోని విద్యుత్ అధికారులు, ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులతో స్థానిక విద్యుత్ గెస్ట్‌హౌస్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సమస్యను తెలిపేందుకు 87124 83490 నంబర్ అందుబాటులో ఉంటుందని, సమస్య వివరించడంతో పాటు సంబంధిత ఫొటోను వాట్సాప్‌లో పెట్టవచ్చని చెప్పారు. సమీప సబ్ స్టేషన్‌లో ఉండే ఫిర్యాదుల పుస్తకంలోనూ సమస్యను నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లు, స్తంభాలు తదితర సమస్యలు తమ దృష్టికి తేవాలని కోరారు. విద్యుత్ వినియోగం, సమస్యల పరిష్కారం వంటి అంశాలపై రైతులకు పొలంబాట, వినియోగదారులకు జూలై మొదటి వారంలో గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కంపెనీ స్థాయిలో సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800 4250028ను సంప్రదించవచ్చని సూచించారు. సమావేశంలో ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, వైరా, సత్తుపల్లి, ఖమ్మం ఎంఆర్‌టీ, టెక్నికల్, విజిలెన్స్ డీఈలు నంబూరి రామారావు, సీహెచ్ నాగేశ్వరరావు, బండి శ్రీనివాస రావు, ఎల్.రాములు, బాబూరావు, భద్రూ, టి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఏఓ శ్రీధర్, ఏఓ మురళి, ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు మందపాటి సత్యనారాయణ రెడ్డి, ఎం. ప్రసాద్, సురేష్, బీవీఎస్ మూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు.