
నాణ్యమైన బోధన అందించాలి
తిరుమలాయపాలెం: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతతో కూడిన విద్యాబోధన అందించాలని వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కె.సత్యనారాయణరెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని ఏలువారిగూడెం, పాతర్లపాడు ప్రాథమిక పాఠశాలలు, బీరోలు, జల్లేపల్లి, తిరుమలాయపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలను శనివారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం వంటి వాటిని పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉందా లేదా అని ప్రతీ తరగతిలోకి వెళ్లి ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బోధన, అభ్యసన ప్రక్రియలను సమర్థంగా నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు డిజిటల్ పరికరాలను ఉపయోగిస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. ఈ సందర్భంగా జల్లేపల్లిలోని పీఎం శ్రీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఈఓ శ్రీనివాసరావు, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ పెసర ప్రభాకర్‌రెడ్డి, జల్లేపల్లి, తిరుమలాయపాలెం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దారా రాజేష్, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ ఆర్‌జేడీ సత్యనారాయణ రెడ్డి