
ఎర్రజెండాలన్నీ ఏకమైతే ప్రజలకు మేలు
● హామీల అమలులో కాంగ్రెస్ ఆలస్యం ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
ఖమ్మంరూరల్: కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకమైతే ఢిల్లీలో ఎర్రకోటపై ఎర్రజెండాను ఎగురవేయొచ్చని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. రూరల్ మండలంలోని పెదతండాలో గురువారం నిర్వహించిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఒకే ఒకపార్టీ సీపీఐ మాత్రమేనని... ఆది నుంచి పేదలకు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతోందన్నారు. కాగా, ప్రజలు ఇచ్చిన అధికారంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టులు చర్చలకు వస్తామని ప్రకటించినా ఆపరేషన్ కగార్ పేరుతో మారణకాండ చేయడం ఇందులో భాగమేనని తెలిపారు. అయితే, మావోయిస్టులు కూడా వనం వీడి జనంలోకి రావాలని కూనంనేని చెప్పారు. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులకు మద్దతుగా నిలిచింది సీపీఐనేనని చెప్పారు. కాగా, కాంగ్రెస్ తప్పిదాలతోనే బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిందని వెల్లడించిన ఆయన ఏపీలో అధికారం కోసం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ బీజేపీ వద్ద మోకరిల్లారని ఎద్దేవా చేశారు. రాజకీయ మేధావులు, విశ్లేషకులు, ప్రజలు కమ్యూనిస్టు పార్టీ ఆవశ్యకతను గుర్తెరిగి చెట్టు లాంటి కమ్యూనిస్టు పార్టీకి అండగా నిలవాలని సూచించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాటు ఏమీ చేయకుండా ఆర్థిక లోటు పేరుతో హామీలను నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని కూనంనేని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు బాగం హేమంతరావు, ఎం. డీ.మౌలానా, దండి సురేష్, మిడకంటి చినవెంకటరెడ్డి, చెరుకుపల్లి భాస్కర్, పుచ్చకాయల సుధాకర్, ఉసికల రవికుమార్, సీతామహాలక్ష్మి, సిద్దినేని కర్ణకుమార్, పి.చందర్‌రావు, శంకర్‌రెడ్డి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.