
రక్తమోడుతున్న రోడ్లు
నిత్యం రహదారులు రక్తమోడుతున్నాయి. జిల్లాలోని ప్రధాన రహదారులపై రోజుకో ప్రమాదం సంభవిస్తోందంటే అతిశయోక్తి కాదు. బయటకు వెళ్లినవారు తిరిగి వచ్చేవరకూ ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు కలవరానికి గురవుతున్నారు. – ఖమ్మంక్రైం
మితిమీరిన వేగం
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణాల్లో మితిమీరిన వేగం ఒకటని అధికారులు చెబుతున్నారు. వాహనదారులు వినియోగించే పెద్ద పెద్ద వాహనాల నుంచి ద్విచక్రవాహనాల వరకు ఒక స్పీడ్ లిమిటెడ్‌ను చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు నడపడంతో ఒకరినొకరు ఢీకొని ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా క్షతగాత్రులుగా మారుతున్నారు.
ఈ రహదారులపై హడల్
జిల్లాలో ప్రధానమైన ఖమ్మం నుంచి కొత్తగూడెం, సత్తుపల్లి, వరంగల్ వెళ్లే ప్రధాన రహదారుల్లో ప్రయాణమంటే వాహనదారులు హడలిపోతున్నారు. నిత్యం కనీసం రెండు, మూడు అయినా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయడంలో అతిశయోక్తి లేదు. గ్రీన్‌ఫీల్డ్ హైవే అయితే తప్ప ఈ ప్రమాదాలు కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వైరా రోడ్డులోని కొణిజర్ల మండలంతో పాటు వైరా, తల్లాడ, కల్లూరు, తిరుమలాయపాలెం మండలాల్లో ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగాయని, ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు, రూరల్ పరిధిలోనూ ప్రమాదాలు ఎక్కువయ్యాయని చెబుతున్నారు.
పట్టించుకోని అధికారులు..
జిల్లాలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 30కి పైగా బ్లాక్ స్పాట్‌లు ఉన్నాయి. అయినా ఆ ప్రాంతంలో సూచిక బోర్డులు కాని, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఎలాంటి ఏర్పాట్లు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం జరిమానాల కోసమే వాహనాల తనిఖీ చేయడం కాకుండా వాహనదారులు ఎలాంటి నిబంధనలు పాటించాలి, ప్రమాదాలు జరగడం వలన జరిగే ఇబ్బందులు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు చెబుతున్నారు.
ఐదున్నర నెలల్లో 150 మంది..
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన 429 రోడ్డు ప్రమాదాల్లో 162 మంది మృతిచెందగా.. 431 మంది క్షతగాత్రులయ్యారు. అయితే, ఇవి అధికారిక రికార్డుల్లో నమోదు కాక.. రికార్డులకెక్కని ఘటనలు చాలానే ఉంటాయని చెబుతున్నారు.
జిల్లాలో ప్రతీ ప్రధాన రహదారిపై రోజుకో ప్రమాదం
గడిచిన ఐదున్నర నెలల్లో 150 మంది మృతి
వందల సంఖ్యలో క్షతగాత్రులు
ఓవర్‌టేక్
జిల్లాలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఓవర్ టేక్ కూడా ముఖ్య కారణమని అధికారులు చెబుతున్నారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఎలాగైనా దాటాలనే ఆతృతలో ఆ వాహనం సైడ్ ఇచ్చాడా లేదా అని ఆలోచించకుండా ఓవర్ టేక్ చేయడం.. ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా కాళ్లు, చేతులు, విరిగి అవిటివారిగా మారిపోతుడడం పరిపాటిగా మారింది.
మితిమీరిన వేగం, ఓవర్‌టేక్ వల్లే....
జిల్లాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ముఖ్యకారణం మితిమీరిన వేగం, ఓవర్‌టేక్ అని చెప్పవచ్చు. తనీఖీలు నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్క వాహనదారుడికి రోడ్డు నిబంధనలు పాటించాలని చెబుతున్నాం. మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుందని అవగాహన కల్పించినప్పుడు వింటున్నారు. కానీ రోడ్డు ఎక్కగానే మరిచిపోతుండడం ప్రమాదాలకు కారనమవుతోంది రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశముంటుంది.
– వెంకటరమణ, జిల్లా రవాణాశాఖాధికారి
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు..
నెల ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు
జనవరి 78 25 78
ఫిబ్రవరి 79 29 71
మార్చి 87 33 61
ఏప్రిల్ 80 27 66
మే 50 28 80
జూన్ 55 20 75

రక్తమోడుతున్న రోడ్లు

రక్తమోడుతున్న రోడ్లు