వేతన.. వెతలు | - | Sakshi
Sakshi News home page

వేతన.. వెతలు

Jun 27 2025 4:14 AM | Updated on Jun 27 2025 4:14 AM

వేతన.

వేతన.. వెతలు

● జీపీ కార్మికులకు మూడు నెలలుగా అందని జీతం ● జిల్లాలో 2వేల మంది ఎదురుచూపులు ● నేడు హైదరాబాద్‌లో ఆందోళనకు పయనం

నేలకొండపల్లి: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలోనే కాక ఇతర అంశాల్లో కీలకపాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు అందటం లేదు. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారు. గ్రామపంచాయతీల్లో కార్మికులే కాక వాటర్‌ మెన్లు, ట్రాక్టర్‌ డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, కారోబార్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. అసలే చాలీచాలనీ వేతనాలతో బతుకుబండి లాగిస్తుండగా ఆ వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్‌ పెట్టడం సరికాదని వాపోతున్నారు. ఈనేపథ్యాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా శుక్రవారం హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం ముట్టడికి వెళ్లేందుకు జిల్లా కార్మికులు సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలకం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌, పల్లె ప్రగతి తదితర కార్యక్రమాలలో కార్మికులే కీలకంగా వ్యవహరిస్తన్నారు. జిల్లాలో 2 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా వీరికి నెలనెలా రూ.9,500 వేతనం చెల్లిస్తున్నారు. పెరిగిన ఖర్చుల రీత్యా వేతనాలు పెంచాలంటూ డిమాండ్‌ చేస్తుండగా ఫలితం లేకపోగా ఆ వేతనం కూడా సక్రమంగా చెల్లించకపోవడం వారిని ఆవేదనకు గురిచేస్తోంది.

ఉద్యోగ భద్రత కరువు

ఉద్యోగ భద్రత లేక ప్రతీరోజు బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. కనీసం వేతనం రూ.20 వేలు ప్రతినెలా ఎస్‌టీఓ ద్వారా చెల్లించడమే కాక ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా అమలుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం హైదరాబాద్‌లో జరగనున్న ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.

పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి

ఖమ్మంమయూరిసెంటర్‌: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌(టీయూసీఐ) నాయకులు కోరారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అమర్లపూడి అప్పారావు, పగిడికత్తుల రాందాస్‌ ఆధ్వర్యాన జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ప్రజా పాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీ కార్మికులను సంక్షేమాన్ని పట్టించుకోకపోగా వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్‌ ఉండడంతో ఇబ్బంది పడుతున్నందున వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీగడ సైదులు, జోగా నాగేశ్వరరావు, కత్తుల భిక్షం, రమేష్‌, గోపి, భాష, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

చిత్తశుద్ధి లేని ప్రభుత్వం

పంచాయతీ కార్మికులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. ఇచ్చే అరకొర వేతనం కూడా నెలల తరబడి పెండింగ్‌ పెట్టడం సరికాదు. ఇకనైనా కార్మికులకు ప్రతినెలా ఎస్‌టీఓ ద్వారా జీతం చెల్లించాలి. ఇందుకు ప్రత్యేక గ్రాంట్‌ మంజూరు చేయాలి.

– టి.విష్ణు, పంచాయతీ వర్కర్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు

భారంగా కుటుంబ పోషణ

ప్రతినెలా జీతాలు రాక కుటుంబ పోషణ భారంగా మారింది. ఇకనైనా అధికారులు స్పందించి కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించి పెండింగ్‌ లేకుండా చెల్లించాలి. అలాగే, బీమా కల్పించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి.

– బొడ్డు ఆంజనేయులు,

మల్టీపర్పస్‌ వర్కర్‌, కోనాయిగూడెం

వేతన.. వెతలు1
1/2

వేతన.. వెతలు

వేతన.. వెతలు2
2/2

వేతన.. వెతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement