
ఆవేతనలో గోపాలమిత్రలు..
● 9 నెలలుగా వేతనాల కోసం ఎదురుచూపులు ● అర్ధాకలితో విధులు నిర్వహిస్తున్న వైనం ● జీవాలకు చికిత్స చేసేలా 2000 సంవత్సరంలో నియామకం
నేలకొండపల్లి: మేలు రకం పశువుల సంతతి పెంచడమే లక్ష్యంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమా న్ని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డాల్డా) అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 2000 సంవత్సరంలో రాష్ట్రంలోనే మొదటిసారి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాచారాంలో గోపాలమిత్ర వ్యవస్థను ప్రారంభించారు. తొలుత జిల్లాలో నలుగురికి శిక్షణ ఇచ్చి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 255 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ వీరికి గతేడాది సెప్టెంబర్ నుంచి గౌరవ వేతనం అందక అర్ధాకలితో విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
విధులు ఇలా..
గోపాలమిత్రలకు పలు రకాల విధులను అప్పగించారు. కృత్రిమ గర్భధారణ కోసం మేలు రకం జాతి పశువుల వీర్యాన్ని సేకరించి పశువులకు ఇవ్వడం ప్రధాన విధి. అంతేకాక పాల దిగుబడి పెరిగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలాగే, జీవాలకు క్షేత్రస్థాయిలోనే ప్రథమ చికిత్స చేయాలి. ఈ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తుండడంతో విడతలుగా వీరి గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం నెలకు రూ.11,050 అందుతుండగా.. గతేడాది ఆగస్టులో చివరిసారిగా వేతనాలు జమఅయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు వేతనాలు అందకపోవడం గమన్హారం. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో గోపాలమిత్రలకు దాదాపు రూ.2.60 కోట్ల మేర బకాయి ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో గోపాలమిత్రలు కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారు.
బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలి
సకాలంలో వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారింది. తొమ్మిది నెలలుగా వేతనాలు రాక అవస్థ పడుతున్నాం. కనీసం బైక్ పెట్రోల్ ఖర్చులకూ ఇబ్బందిగా ఉంది. ఇకనైనా పెండింగ్ వేతనాలు విడుదల చేయడమే కాక నెలనెలా వేతనాలు చెల్లించాలి. –బోయపాటి నారాయణ,
గోపామిత్రల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు..
గోపాలమిత్రల వేతనాలు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. ప్రతీనెలా మా కార్యాలయం నుంచి ప్రతిపాదనలు పంపుతున్నాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే విడుదల అవుతాయని అనుకుంటున్నాం. నిధులు రాగానే చెల్లింపులు చేపడుతాం. –రూప్‌కుమార్,
జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ
లక్ష్యం చేరకపోతే వేతనంలో కోత
నిర్దేశిత సంఖ్యలో పశువులకు కృత్రిమ గర్భధారణ కోసం గోపాలమిత్రలు ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీనెలా తమ పరిధిలో 80 – 100 పశువులకు చేయాలనేది లక్ష్యం. ఇందుకోసం రైతుల నుంచి ప్రతీ పశువుకు రూ.40 చొప్పున వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి. అయితే, లక్ష్యం మేరకు చేయకపోతే ఎన్ని పశువులు తగ్గుతాయే అంత మేర గోపాలమిత్రల వేతనం నుంచి మినహాయిస్తున్నారు. ఇచ్చేదే అరకొర వేతనం కాగా, ఆపై లక్ష్యాల పేరిట కోత విధిస్తుండడం, ఇప్పుడు తొమ్మిది నెలలుగా అసలు వేతనాలు చెల్లించకపోవడం వారిని ఆవేదనకు గురిచేస్తోంది.

ఆవేతనలో గోపాలమిత్రలు..