
విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధత
ఖమ్మంసహకారనగర్: గత ఏడాది మాదిరి వరదలు వస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి విపత్తుల నిర్వహణపై బుధవారం ఆయన సమీక్షించారు. గతంలో ముంపునకు గురైన ప్రతీ హ్యాబిటేషన్‌లో పరిశీలించి మళ్లీ వరద వస్తే ఎక్కడకు తరలించాలనే అంశంపై ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. కలెక్టరేట్‌లో 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్ సిద్ధం చేయాలని, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో నీటి వనరుల్లో చేరే వరదను గమనిస్తుండాలని చెప్పారు. సీపీ సునీల్‌దత్ మాట్లాడుతూ.. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ముందు జాగ్రత్త చర్యలు కీలకమని తెలిపారు. ఆ తర్వాత అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడగా డీఆర్వో ఎ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు ఇసుక
ఖమ్మంఅర్బన్: జిల్లాలో అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుక కొరత రాకుండా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో మైనింగ్, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, ప్రాధాన్యత కార్యక్రమాలకు ఇసుక కొరత రాకుండా పర్యవేక్షించాలని తెలిపారు. టీజీఎండీసీ ఆధ్వర్యాన ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లుగానే మధిర మార్కెట్ యార్డు, పాలేరు తహసీల్, కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయం, సత్తుపల్లి మార్కెట్లలోనూ ఏర్పాటు చేయాలని చెప్పారు. వీటి నిర్వహణను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించి పర్యవేక్షించాలని సూచించారు. మైన్స్ ఏడీ సాయినాథ్, టీజీఏడీసీ పీఓ జి.శంకర్‌నాయక్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ ఎస్‌ఈలు యాకూబ్, ఎం.వెంకటేశ్వర్లు, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఈఈలు రంజిత్, వాణిశ్రీ పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి