
అప్రకటిత ఎమర్జెన్సీ అత్యంత ప్రమాదం
● వాజ్‌పేయి, మోదీ అధికారానికి చంద్రబాబే కారణం ● రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి
ఖమ్మంమయూరిసెంటర్: ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకు లు, సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి పేర్కొన్నారు. ప్రకటిత ఎమర్జెన్సీ కంటే అప్రకటిత ఎమర్జెన్సీ అత్యంత ప్రమాదకరమని, నాటి ఎమర్జెన్సీని వ్యతిరేకించిన ఏకైక పార్టీ సీపీఎం అని చెప్పారు. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యాన జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్‌లో బుధవారం ‘ఎమర్జెన్సీకి 50 ఏళ్లు – నేటి నయా ఫాసిస్ట్ ప్రమాదం’, ‘నేటి ప్రజాస్వామ్యం – సవాళ్లు’అంశాలపై నిర్వహించిన సెమినార్‌లో రవి మాట్లాడారు. ప్రస్తుతం రాజ్యాంగం తీవ్ర స్థాయిలో అణచివేతకు గురవుతోందని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సూత్రాలపై ప్రస్తుత దాడి ప్రమాదకరమైందని, నిరంకుశత్వం వ్యవస్థీకృతం కావడానికి ఇది దారితీసిందన్నారు. అంతేకాక దేశం అన్న భావననే తలకిందులు చేసేలా విషపూరితంగా హిందుత్వ విధానాలను జొప్పిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పాలన వ్యవస్థను తొలగించడం కష్టంగా అనిపించినా, 1970 ఎమర్జెన్సీపై పోరాడిన అనుభవం గుర్తు చేసుకుంటే విశ్వాసమే కనిపిస్తుందని చెప్పారు. కాగా, గతంలో వాజ్‌పేయి రెండుసార్లు, ఇప్పుడు మోదీ అధికారంలో ఉన్నారంటే చంద్రబాబు బలపర్చడమే కారణమని ఆయన పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కాంగ్రెస్ పాలకులు ప్ర జాస్వామ్య హక్కులను కాలరాశారని, ప్రస్తుతం బీజేపీ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినట్లుగానే నేడు బీజేపీ అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు బండి రమేశ్, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రం, ఎం.సుబ్బారావు పాల్గొన్నారు.